Hemant Soren : బీజేపీ ఆఫీసులు కట్టేందుకు ప్రజలను చంపారు.. హేమంత్ సోరెన్ సంచలన ఆరోపణ

by Hajipasha |
Hemant Soren : బీజేపీ ఆఫీసులు కట్టేందుకు ప్రజలను చంపారు.. హేమంత్ సోరెన్ సంచలన ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా జార్ఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వేదికగా బీజేపీపై సీఎం హేమంత్ సోరెన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌ను పాలించిన సమయంలో సామాన్య ప్రజల భూములను బీజేపీ నేతలు దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. కబ్జా చేసిన స్థలాల్లో బీజేపీ ఆఫీసులను కట్టేందుకు ప్రజలను చంపిన చరిత్ర కూడా కాషాయ పార్టీకి ఉందని సీఎం హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఉన్న బీజేపీ ఆఫీసులు ఆవిధంగా కట్టినవేనన్నారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ ఆఫీసులు కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీసులను ఎలా కట్టారు ? ఈ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలి’’ అని సీఎం హేమంత్ సోరెన్ ప్రశ్నించారు. తప్పుడు అభియోగాలతో తనను జైల్లో పెట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. అధికారంలో ఉన్నప్పుడు జార్ఖండ్‌లో దారుణాలకు పాల్పడిన బీజేపీ నేతలను మాత్రం అరెస్టు చేయడం లేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story