బీజేపీ ఎస్‌బీఐని వాడుకుంటోంది: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు

by samatah |
బీజేపీ ఎస్‌బీఐని వాడుకుంటోంది: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మోడీ ప్రభుత్వం అక్రమ లావాదేవీలను దాచడానికి ఎస్‌బీఐని వాడుకుంటుందని ఆరోపించారు. బ్యాంకును తమకు రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ పథకమే అప్రజాస్వామికమని, అపారదర్శకమైందని ఖర్గే అభివర్ణించారు. ఈ స్కీమ్‌తో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీజేపీ మాత్రమేనని నొక్కి చెప్పారు. ఎన్నికలు ముసిసే సమయానికి వివరాలను పంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఎన్నికల బాండ్లకు బదులుగా హైవేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, పవర్ ప్లాంట్లు తదితర కాంట్రాక్టులను మోడీ తన సన్నిహితులకు కట్టపెడుతున్నారని తెలిపారు. బీజేపీ ఖజానా నింపుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ), ఎన్నికల సంఘం, పార్లమెంటుతో సహా అన్ని సంస్థలను వాడుకుంటుందని చెప్పారు. ఎస్‌బీఐ పిటిషన్‌ను అనుమతించొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోపు వెల్లడించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. కానీ తాజాగా ఈ గడువును జూన్ 30వరకు పొడిగించాలని ఎస్‌బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

Next Story