పోస్టులను భర్తీ చేయకుండా బీజేపీ రిజర్వేషన్లను హిందూ-ముస్లిం సమస్యగా మారుస్తోంది: ఖర్గే

by Harish |   ( Updated:2024-05-21 09:58:34.0  )
పోస్టులను భర్తీ చేయకుండా బీజేపీ రిజర్వేషన్లను హిందూ-ముస్లిం సమస్యగా మారుస్తోంది: ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కాంగ్రెస్ అనుకూలంగా ఉందని, కానీ బీజేపీ రిజర్వేషన్లను హిందూ-ముస్లిం సమస్యగా మార్చి రెండు వర్గాల మధ్య వివాదాలు సృష్టిస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఒక మీడియాతో అన్నారు. ప్రజలకు రిజర్వేషన్ ప్రయోజనాలను దూరం చేసింది బీజేపీయేనని ఖర్గే ఆరోపించారు. కేంద్రంలో 30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేసేందుకు ప్రయత్నించలేదు. వాటిని భర్తీ చేసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు దాదాపు 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. యూనివర్శిటీల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్లను నియమించడం లేదు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యర్థులను కాకుండా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ పొందిన వ్యక్తులకు ప్రయోజనాలను అందిస్తుందని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు.

ఉద్యోగాల భర్తీ గురించి ఆలోచన చేయకుండా బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, మాయమాటలు చెబుతుందని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ నుంచి కొంతమంది నాయకులు బీజేపీలో చేరడం మాట్లాడిన ఆయన, పార్టీని వీడిన వారు పార్టీ సిద్ధాంతంలో పాతుకుపోలేదని అన్నారు. వారు రాహుల్ గాంధీతో తిరుగుతారు. వారికి మంత్రి పదవులు వచ్చేలా చూశారు, వారికి రాజకీయ గుర్తింపును కల్పించడంలో సహాయం చేశారు. ఇప్పుడు వారికి అకస్మాత్తుగా, రామ మందిరం గుర్తుకు వచ్చిందా? అని విమర్శించారు.

కాంగ్రెస్‌లో తాము ఎదగడం లేదని పార్టీని వీడిన వారి వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే, మా పార్టీలో ప్రాముఖ్యత లేదని, వారు బీజేపీలో చేరుతున్నారు, మరి అక్కడ వారికి ప్రాముఖ్యత లభించిందా? వారు దానిని అక్కడ పొందుతున్నారా? భయపడి పార్టీ మారిన వారికి గుర్తింపు ఉంటుందా? అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయని ఖర్గే తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed