Google Maps: గూగుల్ మ్యాప్ తెచ్చిన తిప్పలు.. దట్టమైన అడవుల్లో రాత్రంతా ఓ కుటుంబం.. చివరికి?

by Ramesh N |   ( Updated:2024-12-07 07:02:32.0  )
Google Maps: గూగుల్ మ్యాప్ తెచ్చిన తిప్పలు.. దట్టమైన అడవుల్లో రాత్రంతా ఓ కుటుంబం.. చివరికి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గూగుల్ మ్యాప్ (Google Maps) రాంగ్ రూట్ చూపించి ఓ కుటుంబానికి చుక్కలు చూపించింది. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు బయలుదేరిన (Bihar family) ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా బిక్కు బిక్కుమంటూ అక్కడే జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన రణజిత్ దాస్ అనే వ్యాపారి ఉజ్జయిని నుంచి గోవాకు తన కుటుంబంతో గూగుల్ మ్యాప్ సహాయంతో కారులో వెళ్తున్నాడు. ఇలా వారు కర్ణాటక, బెలగావి జిల్లాలోని ఖానాపూర్ పట్టణం దాటిన తర్వాత మ్యాప్ వారిని శిరోడగ-హెమ్మడగా మధ్యలో దారి తప్పిపోయారు. మ్యాప్ సూచనలతో కారు దట్టమైన అడవిలోకి తీసుకెళ్లింది. గురువారం భీమ్‌ఘడ్ అటవీ ప్రాంతంలోకి దాదాపు 7 కిలోమీటర్లు లోనికి వెళ్లడంతో ఆ ప్రాంతంలో ముబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో కుటుంబం రాత్రిపూట నిస్సహాయ స్థితిలో కారులో గడపాల్సి వచ్చింది. మరుసటి రోజు ఉదయం ముబైల్ నెట్‌వర్క్ కవరేజీ ఉన్న లోకేషన్ కోసం దాదాపు 3 కిలోమీటర్ల మేర నడిచారు.

తర్వాత కవరేజీని తిరిగి పొందాక వెంటనే ఎమెర్జెన్సీకి 112‌కు కాల్ చేశారు. దీంతో బెలగావి పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఖానాపూర్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే కుటుంబాన్ని గుర్తించడానికి పోలీసులు, స్థానిక గ్రామస్థుల సహాయంతో జీపీఎస్ ద్వారా కుటుంబాన్ని గుర్తించి రక్షించారు. ఇటీవలే ఇదే ప్రాంతంలో ఓ రైతుపై ఎలుగుబంటి తీవ్రంగా దాడి చేసిందని ఖానాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ నాయక్ మీడియాతో వివరాలు వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా ఇలా గూగుల్‌ తల్లిని నమ్ముకోని మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇటీవల నవంబర్ 24వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకోని పాక్షికంగా నిర్మించిన వంతెన నుంచి రామగంగా నదిలోకి పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే.

Next Story