Yamini Krishnamurthy : భరతనాట్యం నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి ఇక లేరు

by Hajipasha |   ( Updated:2024-08-03 14:29:09.0  )
Yamini Krishnamurthy : భరతనాట్యం నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి ఇక లేరు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు చెందిన ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. గత ఏడు నెలలుగా యామినీ కృష్ణమూర్తికి ఐసీయూలోనే చికిత్స జరుగుతోందని ఆమె మేనేజర్ అండ్ సెక్రెటరీ గణేశ్ వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి యామినీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఢిల్లీలోని యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ అకాడమీలో ఉంచుతామని తెలిపారు. అంత్యక్రియల వివరాలు ఖరారు కాగానే తెలియజేస్తామని గణేశ్ అన్నారు. యామినీ కృష్ణమూర్తికి ఇద్దరు సోదరీమణులు ఉన్నారని చెప్పారు.

పూర్తి పేరు యామినీ పూర్ణతిలకం..

యామినీ కృష్ణమూర్తి పూర్తి పేరు యామినీ పూర్ణతిలకం. ఆమె ఏపీలోని మదనపల్లెలో 1940 డిసెంబరు 20న జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. వీరి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. తన తండ్రి ప్రోత్సాహంతో 5వ ఏట నుంచే చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో యామినీ భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. అనంతరం కూచిపూడి, ఒడిస్సీ కూడా నేర్చుకున్నారు. ఎం.డి.రామనాథన్ దగ్గర కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్నారు. యామినీ తన తొలిప్రదర్శనను 17వ ఏట 1957లో చెన్నైలో ఇచ్చారు. అప్పటి నుంచి దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతలు పొందారు. అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, మయన్మార్ వంటి దేశాల్లో యామినీ కృష్ణమూర్తి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

అత్యున్నత పౌర పురస్కారాలు..

యామినీ కృష్ణమూర్తికి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలు లభించాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగానూ యామినీ సేవలు అందించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ అకాడమీని స్థాపించి ఎంతో మంది యువతకు ఆమె భరత నాట్యం, కూచిపూడిలో ట్రైనింగ్ ఇచ్చారు. ‘ఏ ప్యాషన్‌ ఫర్‌ డ్యాన్స్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని యామిని రచించారు. న్యూఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు యామినీ డైరెక్టరుగా సేవలు అందించారు. ఈమె వివాహం చేసుకోకుండా నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు.

Advertisement

Next Story