ఉదయనిధి స్టాలిన్‌కు భారీ ఊరటనిచ్చిన కోర్టు

by Harish |
ఉదయనిధి స్టాలిన్‌కు భారీ ఊరటనిచ్చిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గాను మంగళవారం బెంగళూరు సిటీ కోర్టుకు హాజరు కాగా, ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ 2023 సెప్టెంబరులో చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని, మలేరియా, డెంగ్యూ వంటి 'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి' అని అన్నారు. సనాతన ధర్మాన్ని వ్యాధులతో పోల్చడంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఈ క్రమంలో సామాజిక కార్యకర్త పరమేష్ కోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తనను, తన మతాన్ని, హిందూ మతానికి చెందిన వ్యక్తులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. అల్లర్లు సృష్టించడం, మతపరమైన భావాలను గాయపరచడం, రెచ్చగొట్టడం, పరువు నష్టం వంటి నేరాల కింద ఉదయని స్టాలిన్‌ వ్యాఖ్యలను కోర్టు పరిగణలోకి తీసుకుని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన తాజాగా 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. తదుపరి కేసు విచారణను ఆగస్టు 8కి వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed