- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pakistan : పాకిస్తాన్‌లో పాశవిక ఉగ్రదాడి.. 50 మందికిపైగా పౌరులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్(Pakistan)లో మరో భీకర ఉగ్రదాడి జరిగింది. పోలీసులు ఎస్కార్ట్ ఇస్తూ తీసుకెళ్తున్న షియా ముస్లింల వాహన కాన్వాయ్‌లోని రెండు ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గురువారం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (Khyber Pakhtunkhwa) ప్రావిన్స్‌లోని కుర్రం(Kurram) జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 50 మందికిపైగా చనిపోయారు. మరణించిన వారిలో అత్యధికులు షియా వర్గం ముస్లింలే. మరో 29 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. గాయపడిన వారిలో దాదాపు 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు.
ఘటన ఇలా జరిగింది..
కుర్రం జిల్లా కేంద్రంగా ఉన్న పరాచినార్ నగరం నుంచి ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌కు ప్రయాణికులతో భారీ వాహన కాన్వాయ్ బయలుదేరింది. కాన్వాయ్‌లో పదులసంఖ్యలో ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి. తాలిబన్లకు మద్దతుగా నిలిచే స్థానిక తెగలు అత్యధికంగా నివసించే ఏరియాకు ఈ వాహన కాన్వాయ్ చేరుకోగానే.. సాయుధ దుండగులు రెండు వాహనాలను అకస్మాత్తుగా చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. కుర్రం ప్రాంతంలో 42 శాతం మంది షియా ముస్లింలు, 58 శాతం మంది సున్నీ ముస్లింలు ఉంటారు.
గత కొన్ని నెలల వ్యవధిలో పలుమార్లు ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. కొన్ని వారాల క్రితమే కుర్రం జిల్లాలోని ప్రధాన రహదారులను తెరిచారు. దీంతో ఈ జిల్లాకు చెందిన షియా వర్గం ప్రజలు పెద్దసంఖ్యలో ప్యాసింజర్ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. ఈక్రమంలో పరస్పర దాడులు జరగొచ్చనే ఆందోళనల నేపథ్యంలో ప్రధాన రహదారులపై వాహనాలకు పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాట్లు చేశారు. పోలీసు పహారా ఉండగానే ఉగ్రమూకలు వచ్చి ఈ పాశవిక దాడి జరిపి పరార్ కావడం గమనార్హం. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పౌరులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడి అమానుషమైందని ఆయన చెప్పారు. దీనిపై దర్యాప్తు చేయించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.