సీఎం అయినంత మాత్రానా ప్రత్యేక హక్కులేం ఉండవ్!

by S Gopi |
సీఎం అయినంత మాత్రానా ప్రత్యేక హక్కులేం ఉండవ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉండనున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ పాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్‌ పాలసీ స్కామ్‌ ద్వారా అక్రమ సంపాదన కోసం కేజ్రీవాల్ కుట్రపన్నారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. అరెస్టుకు సంబంధించి ఈడీ వద్ద కావాల్సిన ఆధారాలు ఉన్నాయని, హావాలా రూపంలో నగదు తరలింపు గురించి ఈడీ ఆధారాలను ఉంచిందని, గోవా ఎన్నికలకు రూ. 100 కోట్ల డబ్బు ఇచ్చిన విషయాన్ని అప్రూవర్ చెప్పినట్టు న్యాయస్థానం వెల్లడించింది. కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని అభిప్రాయపడింది. ఇదే సమయంలో కోర్టు.. 'ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ జరగాల్సిన విధానాన్ని నిందితులు చెప్పాల్సిన అవసరంలేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు' అని వ్యాఖ్యానించింది. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం కలిగించేందుకే ఈ సమయంలో ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్‌ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కేజ్రీవాల్‌ తరపున వాదనలు వినిపించగా, ఈడీ తరపున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజు వాదించారు. అందువల్ల, కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి, ఏప్రిల్ 15 వరకు ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉండనున్నారు.

ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. ఆప్‌ను అడ్డుకునేందుకే మద్యం పాలసీ కేసు అతిపెద్ద రాజకీయ కుట్ర అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపణలు చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ ఈ తీర్పు తమకు ఆమోదం కాదు. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. తమ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు లభించిన రీతిలోనే కేజ్రీవాల్‌కు సైతం ఈ కేసులో ఉపశమనం లభిస్తుందనే విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story