పెళ్లి సాకుతో ఆర్మీ నర్సు తొలగింపు కేసులో కేంద్రానికి సుప్రీం షాక్

by S Gopi |   ( Updated:2024-02-21 13:21:39.0  )
supreme court notices to twitter
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాహాన్ని సాకుగా చూపించి మహిళను ఉద్యోగం నుంచి తొలగించడం 'లింగ వివక్ష' కిందకే వస్తుందని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివక్షాపూరితంగా వ్యవహరించే ఏ చట్టాన్ని కూడా రాజ్యాంగం అనుమతించదని పేర్కొంది. వివాహం తర్వాత మహిళను ఉద్యోగం నుంచి తొలగించిన కారణంగా ఆమెకు రూ. 60 లక్షల పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. భారత సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను కేంద్రం 1988లో విధుల నుంచి తొలగించింది. ఆ సమయంలో ఆమె సైన్యంలో లెఫ్టినెట్ హోదాలో బాధ్యతలు నిర్వహించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించిన వ్యహారంపై 2012లో సాయుధ బలగాల ట్రిబ్యునల్‌ను ఆమె ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో తిరిగి తనను విధుల్లోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అనంతరం 2019లో కేంద్రం దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పులో జోక్యం అవసరంలేదని ఫిబ్రవరి నాటి ఉత్తర్వుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వివాహ కారణంతో ఆర్మీ నర్సింగ్ సేవల నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనను 1995లో ఉపసంహరించుకున్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. సదరు ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, జీతం ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పును సవరించింది. ఆమెకు బకాయిల రూపంలో రూ. 60 లక్షలు చెల్లించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలు అందిన ఎనిమిది వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పేర్కొంది.

Advertisement

Next Story