ట్రంప్ మరో కీలక నిర్ణయం.. కెన్నడీ మర్డర్‌ మిస్టరీ విడనుందా?

by D.Reddy |
ట్రంప్ మరో కీలక నిర్ణయం.. కెన్నడీ మర్డర్‌ మిస్టరీ విడనుందా?
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) తన 2.0 పాలనాలో పలు సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా ట్రంప్(Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగానే అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ(John F. Kennedy) హత్యకు సంబంధించిన దస్త్రాలను బహిర్గతం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఈ హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఎలా బహిరంగం చేయనున్నారో 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని నేషనల్ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌కు ట్రంప్‌ ఆదేశాలు ఇచ్చారు. అలాగే, మాజీ సెనెటర్‌ రాబర్ట్‌ ఎఫ్‌. కెన్నడీ, పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ హత్యలపై సంబంధించిన వివరాలను కూడా 45 రోజుల్లోగా ఇవ్వాలన్నారు.

అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. జాన్ ఎఫ్.కెన్నడీ హత్యకు గురై 60 ఏళ్లు అవుతుందని గుర్తు చేశారు. కెన్నడీ హత్య వెనుక ఏం జరిగిందో తెలుసుకునేందుకు బాధిత కుటుంబీకులకు, అమెరికా ప్రజలకు హక్కు ఉందని అన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే, జాన్‌ ఎఫ్‌. కెన్నడీ హత్యపై ట్రంప్‌ గతంలోనూ పలుమార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఏం జరిగిందంటే?

అమెరికాకు 35వ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్.కెన్నడీ 1961లో బాధ్యతలు చేపట్టారు. 43 ఏళ్లకే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. అంతేకాదు, అమెరికా చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఓడిపోని అధ్యక్షుడిగా కూడా రికార్డు ఉంది. అయితే 1963 నవంబరు 22న టెక్సాస్‌లో కెన్నడీ దారుణ హత్యకు గురయ్యాడు.

టెక్సాస్‌లోని డల్లాస్ పర్యటనకు వెళ్తుండగా కెన్నడీ కాన్వాయ్‌పై ఓస్వాల్డ్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేయగా.. ఈ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే అతడు కూడా హత్యకు గురయ్యాడు. హార్వేను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్ష వేయగా.. కొంతకాలం తర్వాత అతడు కూడా క్యాన్సర్‌తో మరణించాడు. నాటి నుంచి కెన్నడీ హత్య మిస్టరీగా మారిపోయింది.

ఇక అమెరికా అటార్నీ జనరల్‌, సెనెటర్‌గా పనిచేసిన రాబర్ట్‌ ఎఫ్‌. కెన్నడీ 1968లో హత్యకు గురయ్యారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు లాస్ ఎంజెలెస్‌లోని అంబాసిడర్ హోటల్‌లో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించి బయటకు వస్తుండగా.. రాబర్ట్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. నిందితుడిని పాలస్తీనాకు చెందిన సిర్హాన్‌గా గుర్తించారు. హక్కుల కార్యకర్త మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ కూడా 1968లోనే ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా హత్యకు గురయ్యారు.

Next Story