60 ఏళ్ల మహిళ ఫిర్యాదు.. ప్రజ్వల్ రేవణ్ణపై మరో రేప్ కేసు

by Hajipasha |
60 ఏళ్ల మహిళ ఫిర్యాదు.. ప్రజ్వల్ రేవణ్ణపై మరో రేప్ కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటకలోని హసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అభ్యంతరక వీడియోల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసులమని చెప్పుకుంటూ సివిల్ యూనిఫాంలో వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించినందు వల్లే తాను ప్రజ్వల్‌ రేవణ్ణపై తప్పుడు కేసు పెట్టానని పేర్కొంది. ఈవిషయాన్ని బాధిత మహిళ తమకు తెలియజేసిందంటూ స్వయంగా జాతీయ మహిళా కమిషన్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

బాధిత మహిళలు 2,900 మందికిపైగా ఉన్నారా ? ఎక్కడ : హెచ్‌డీ కుమారస్వామి

ఈ పరిణామంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. ఈ కేసుపై దర్యాప్తుకు కర్ణాటక సర్కారు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆయన తప్పుపట్టారు. సిట్ అధికారులు ఆ మహిళలను బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా వాంగ్మూలాలు ఇవ్వకపోతే.. వ్యభిచారం కేసు నమోదు చేస్తామని వారిని భయపెట్టారన్నారు. ‘‘కిడ్నాప్‌నకు గురైన మహిళను మీరు ఎక్కడ ఉంచారు..? ఆమెను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు..? బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా..?’’ అని కుమారస్వామి ప్రశ్నించారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణ బాధిత మహిళలు 2,900 మందికిపైగా ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది. అయితే వారు ఎక్కడ ఉన్నారు?’’ అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. తాను ప్రజ్వల్‌ను సమర్థించట్లేదని ఈ సందర్భంగా కుమార స్వామి స్పష్టం చేశారు. దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు. దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని చెప్పారు. తమకు అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే తాను హసన్ జిల్లాకు వెళ్లినట్లు ఈ సందర్భంగా కుమారస్వామి వివరించారు.

గవర్నర్‌కు జేడీఎస్ ప్రతినిధి బృందం లేఖ

కుమారస్వామి ఆరోపణలపై కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ.. ‘‘జేడీఎస్ నేతలు చేసే అన్ని ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. సిట్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది’’ అని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు జేడీఎస్ ప్రతినిధి బృందం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌తో సమావేశమై, ఈ కేసుపై నిష్పాక్షిక విచారణ చేయాలని అభ్యర్థిస్తూ లేఖను సమర్పించింది. ఇక ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కర్ణాటక పోలీసులు తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని చెప్పారని ఆరోపిస్తున్న మహిళను తాము సంప్రదించలేదని సిట్ తెలిపినట్లు సమాచారం. సదరు మహిళకు ఫోన్ల ద్వారా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో వారి వివరాలను తెలుసుకునేందుకు సిట్ విచారణ ప్రారంభించింది. ఆమెకు బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ప్రజ్వల్ రేవణ్ణపై మరో రేప్ కేసు

లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణపై మరో రేప్ కేసు నమోదైంది. మే 2న ప్రజ్వల్‌పై మొదటి రేప్ కేసు నమోదైంది. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో గతంలో పనిచేసిన 60 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 5న ఇప్పుడు ఇంకో అత్యాచారం కేసును నమోదు చేశారు. ఆమెను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్న వీడియో ఇటీవల హసన్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో సదరు మహిళ.. ‘‘నేను చాలా పెద్దదాన్ని. నీ తండ్రి, తాతకు కూడా అన్నం వండిపెట్టాను. నన్ను వదిలేయ్’’ అని ప్రజ్వల్ రేవణ్ణను వేడుకుంటున్నట్లుగా సీన్లు ఉన్నాయి. ఈ కేసులో ప్రజ్వల్ దోషిగా తేలితే.. 10 సంవత్సరాల కంటే ఎక్కువే కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. బాధిత మహిళ గురువారం రోజు మేజిస్ట్రేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించడంపై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోనే హసన్, బెంగళూరులోని పలు ప్రాంతాల నుంచి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకు బాధితురాలిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేయించారనే అభియోగం ఉంది. మైసూరు జిల్లా హున్సూర్ తాలూకాలోని హెచ్‌డీ రేవణ్ణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఫామ్‌హౌస్‌లో ఆమెను బందీగా ఉంచగా, మే 4న సిట్ రక్షించింది. ఈ కిడ్నాప్ కేసులో మే 8న హెచ్‌డీ రేవణ్ణను అరెస్టు చేశారు. ఆయన కోర్టు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తనకు బెయిల్ కావాలంటూ హెచ్‌డీ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్ మే 13న విచారణకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed