ఎన్డీయే కూటమిలోకి మరో పార్టీ: బీజేపీలో చేరనున్న తమిళ్‌ మానిల కాంగ్రెస్

by samatah |
ఎన్డీయే కూటమిలోకి మరో పార్టీ: బీజేపీలో చేరనున్న తమిళ్‌ మానిల కాంగ్రెస్
X

దిశ, నేషనల్ పార్టీ: పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మరో పార్టీ చేరింది. తమిళనాడులోని ప్రాంతీయ పార్టీ అయిన తమిల్ మానిల కాంగ్రెస్(టీఎంసీ) బీజేపీతో కలిసి పని చేయనున్నట్టు ఆ పార్టీ చీఫ్ జీకే వాసన్ తెలిపారు. సోమవారం ఆయన చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలను బీజేపీ నాయకత్వంలోనే ఎదుర్కొంటామని వాసన్ వెల్లడించారు. ఫిబ్రవరి 27న తిరుపూర్ జిల్లా పల్లడంలో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు హాజరవుతానని చెప్పారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి టీఎంసీ జాతీయ దృక్పధాన్ని కలిగి ఉందన్నారు. తమిళ ప్రజల సంక్షేమం కోసమే బీజేపీతో చేతులు కలుపుతున్నట్టు స్పష్టం చేశారు. కాషాయ పార్టీతోనే దేశం అభివృద్ధి సాధ్యమని చెప్పారు. దేశంలోని మెజారిటీ ప్రజలు మూడోసారి మోడీనే ప్రధాని కావాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తమిల్ మానిల కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉంది. అయితే గతేడాది బీజేపీతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంది. దీంతో తాజాగా టీఎంసీ ఎన్డీయేలో చేరడంతో అన్నాడీఎంకేతో పొత్తు వీడినట్టైంది. కాగా, తమిళ మనిలా కాంగ్రెస్ పార్టీని మాజీ ఎంపీ జీకే మూపనార్ 1996 మార్చి 26న స్థాపించారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పనిచేస్తున్నది. మూపనార్ మరణానంతరం పార్టీ బాధ్యతలను ఆయన కుమారుడు వాసన్ తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో పోటీ చేయగా ఒక్క సెగ్మెంట్ లోనూ గెలుపొందలేదు.

Advertisement

Next Story