బిహార్‌లో కూలిన మరో వంతెన..వారం రోజుల్లోనే నాలుగో ఘటన

by Vinod |
బిహార్‌లో కూలిన మరో వంతెన..వారం రోజుల్లోనే నాలుగో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో వరుసగా వంతెనలు కూలి పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మూడు బ్రిడ్జిలు ఇప్పటికే కుప్పకూలగా తాజాగా..మరో బ్రిడ్జి కూలిపోయింది. కిషన్ గంజ్ జిల్లాలోని కంకై ఉపనదిపై నిర్మించిన 70 మీటర్ల వంతెన గురువారం కూలిపోయింది. ఇది బహదుర్‌గంజ్, దిఘల్‌బ్యాంక్ బ్లాక్‌లను కలుపుతుంది. దీంతో రెండు పట్టణాల మధ్య రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. నదిలో నీటిమట్టం పెరిగిందని, బలమైన ప్రవాహం కారణంగా వంతెన మధ్యలో ఉన్న పలు స్తంభాలు సుమారు ఒకటిన్నర అడుగుల మేర మునిగిపోయాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు ఆపివేశారు. ఈ వంతెనను ఆరేళ్ల క్రితమే నిర్మించినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ నెల 19న రాష్ట్రంలోని అరారియా జిల్లాలో బక్రా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ప్రారంభానికి ముందే కూలిపోయింది. రూ.12 కోట్లతో నిర్మించిన ఈ వంతెన అప్రోచ్ రోడ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అలాగే సివాన్‌లోని దరౌండా ప్రాంతంలో దారౌండా మహారాజ్‌గంజ్ బ్లాక్‌లను కలుపుతూ నిర్మించిన 100 మీటర్ల వంతెన ఒక చివర కూలిపోయింది. అంతేగాక తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మాణంలో మరో వంతెన తెగిపోయింది. వరుసగా బ్రిడ్జి కూలిన ఘటనలు నమోదవుతుంటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Next Story

Most Viewed