BREAKING: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై మరోసారి దాడి

by Satheesh |   ( Updated:2024-06-27 17:20:13.0  )
BREAKING: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై మరోసారి దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై మరోసారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై దాడి చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎంపీ అసదుద్దీన్ వెల్లడించారు. ఈ ట్వీట్‌ను ఢిల్లీ పోలీసు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలకు ట్యాగ్ చేశారు. గుర్తు తెలియని దుండగులు తన నివాసంపై నల్ల ఇంకుతో దాడి చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని తన నివాసాన్ని టార్గెట్ చేసి జరిగిన దాడులకు లెక్కే లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో జరిగిందని ఆరోపించారు. ఎంపీల భద్రతకు గ్యారెంటీ ఉందో లేదో లేదా చెప్పాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీంతో పాటు తన ఇంటిపై దాడి చేసిన వారికి ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ తరహా దాడులు తనను భయపెట్టలేవని, ఈ సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను ఆపాలని హెచ్చరించారు. రాళ్లు విసరడం, సిరా చుక్కలు చల్లడం వంటివి చేసిన తర్వాత పారిపోకుండా నన్ను నేరుగా ఎదుర్కొండని అన్నారు. కాగా, ఇటీవల లోక్ సభలో ఎంపీగా ఓవైసీ చేసిన ప్రమాణ స్వీకారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం నిండు సభలో ఓవైసీ జై పాలస్తీనా అని స్లోగన్ ఇవ్వడం వివాదస్పదంగా మారింది. భారత పార్లమెంట్‌ సాక్షిగా మరో దేశానికి ఓవైసీ విధేతయ చూపడంపై బీజేపీ నేతలతో పాటు పలువురు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే ఓవైసీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని పలువురు రాష్ట్రపతికి లేఖలు రాయగా.. బీజేపీ నేతలు ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఓవైసీ ఇంటిపై దాడి జరగడం దేశ రాజధానిలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story