ఎన్నికల వేళ మోడీ సర్కార్ ముందు అనూహ్య డిమాండ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-02 09:18:17.0  )
ఎన్నికల వేళ మోడీ సర్కార్ ముందు అనూహ్య డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలను ఐక్యం చేసే పనిలో తన వంతు పాత్ర పోషించే ప్రయత్నాలు చేస్తున్న ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం ముందు వినూత్న నినాదంతో ముందుకు వచ్చారు. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో పోలిక ఉండేలా నితీష్ కుమార్ తాజా నినాదం ఉండటం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

మోడీ ప్రభుత్వం వచ్చాక వన్ నేషన్ వన్ టాక్స్, వన్ నేషన్ వన్ కార్డు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ పెన్షన్, వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్‌, వన్ నేషన్ వన్ మార్కెట్ వంటి పదాలు జోరుగా వినిపిస్తోంది. ఈమేరకు వీటిలో కొన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తుండగా మరికొన్నింటిని అమలు చేసే ప్రతిపాదనలపై కసరత్తు వేగవంతం చేస్తోంది.

ఈ క్రమంలో అనూహ్యంగా బీహార్ అసెంబ్లీ వేదికగా నితీష్ కుమార్ వన్ నేషన్ వన్ పవర్ టారిఫ్ డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఉభయ సభలను ఉద్దేశించి బుధవారం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. దేశంలో విద్యుత్ పాలసీ అస్తవ్యస్థంగా ఉందని ఆరోపించిన ఆయన.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే బిహార్‌కు కేంద్రం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి ఎక్కువ రేటుకు విద్యుత్‌ లభిస్తోందని ఆరోపించారు.

అదే సమయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తామే తక్కువ ధరకు విద్యుత్‌ను అందజేస్తున్నామని చెప్పారు. విద్యుత్ ధరల విషయంలో సమానత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. దేశ నిర్మాణంలో ప్రతి రాష్ట్రం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యుత్ రేటు ఉండాలి కదా అని అభిప్రాయపడ్డారు. ఒకే దేశం, ఒకే విద్యుత్‌ టారిఫ్‌ విధానంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.

వన్ నేషన్ పేరుతో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు తీసుకువస్తున్న తరుణంలో నితీష్ కుమార్ చేసిన డిమాండ్ పొలిటికల్ వైజ్ చర్చగా మారుతోంది. దేశంలో విద్యుత్ రంగంపై ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. గత నెల మొదటి వారంలో నాందేడ్ సభలో కేసీఆర్ కేంద్రంపై ఫైర్ అయ్యారు. తాను రాజకీయం చేయడానికి ఇక్కడికి రాలేదని దేశంలో మార్పు తీసుకువచ్చేందుకే బీఆర్ఎస్ పేరుతో వచ్చానని చెప్పిన ముఖ్యమంత్రి దేశంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.

దేశంలో 4 లక్షల 10వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని చిత్తశుద్ధి ఉంటే దేశమంతటా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు అంటూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణలో రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్ ను సరఫరా చేశామని, హైదరాబాద్‌ను పవన్ ఐలాండ్‌గా మార్చామని చెప్పారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.

విద్యుత్ రంగంపై కేసీఆర్ తరచూ కేంద్రాన్ని కార్నర్ చేస్తున్న తరుణంలో అనూహ్యంగా నితీష్ కుమార్ వన్ నేషన్ వన్ పవర్ టారిఫ్ డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడం రాజకీయాన్ని మరింత ఇంట్రెస్ట్‌గా మారుస్తోంది. ఈ నినాదాన్ని సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయా అనేది చర్చగా మారింది.

అయితే వన్ నేషన్ వన్ పవర్ టారిఫ్ కోసం డిమాండ్ చేస్తున్న నితీష్ కుమార్ పారదర్శకతను కాపాడేందుకు రాష్ట్రంలో స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 12.5 లక్షల మీటర్లను అమర్చామని ప్రకటించారు. అయితే ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో కేసీఆర్ ససేమిరా అంటున్నారు. స్మార్ట్ మీటర్లను తెలంగాణలో అంగీకరించమని స్పష్టం చేస్తున్నారు. దీంతో వన్ నేషన్ వన్ పవర్ టారిఫ్ నినాదం బిహార్ వరకే ఆగిపోతుందా లేక ఇతర రాష్ట్రాల నుంచి ఈ తరహా డిమాండ్లు వస్తాయా అనేది ఆసక్తిగా మారుతోంది.

Advertisement

Next Story

Most Viewed