అధికారంలో రాగానే కనీస మద్దతు ధరకు కాంగ్రెస్ హామీ

by S Gopi |
అధికారంలో రాగానే కనీస మద్దతు ధరకు కాంగ్రెస్ హామీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని దిల్లీలో తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అన్నదాతలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. మంగళవారం ఉదయం పంజాబ్‌, హర్యానాల నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరారు. ప్రభుత్వ మెడలు ఒంచి తమ డిమాండ్లను నెరవేర్చుకుంటామంటున్న రైతుల నిరసనల మధ్య కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో ఆధికారంలోకి వస్తే వివిధ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలకనేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 'రైతు సోదరులారా, ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం, పంటలపై ప్రతి రైతుకు కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 15 కోట్ల రైతు కుటుంబాలకు భరోసా లభిస్తుందని, ఇది రైతులకు న్యాయం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మొదటి హామీ అని' రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. మరోవైపు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చే చట్టంతో పాటు రైతుల డిమాండ్‌ను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ నిరసనకు రైతు సంఘం నాయకులు జగ్‌జీత్ సింగ్ దల్వాల్, సర్వన్ సింగ్ పథేర్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా, పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపునిచ్చాయి.

Advertisement

Next Story