వేగంగా ప్రేమ పెళ్లిళ్లు.. అంతేవేగంగా విడాకులు : హైకోర్టు

by Hajipasha |
వేగంగా ప్రేమ పెళ్లిళ్లు.. అంతేవేగంగా విడాకులు : హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : హిందూ వివాహ చట్టం-1955పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధం మళ్లీ జత కలవలేని విధంగా దెబ్బతినడాన్ని కూడా విడాకుల మంజూరుకు ముఖ్యమైన కారణంగా చేరుస్తూ హిందూ వివాహ చట్టంలో సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. నవీన్ కోహ్లి వర్సెస్ నీలు కోహ్లి కేసులో సుప్రీంకోర్టు గతంలో చేసిన పరిశీలనల దృష్ట్యా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయ శాఖ, న్యాయ కమిషన్‌‌లను హైకోర్టు కోరింది . తాజాగా విచారణ జరిగిన కేసు విషయానికి వస్తే.. ఓ జంట ప్రేమ వివాహంతో ఒక్కటైంది. వారు ఓ బాలికను దత్తత తీసుకున్నారు. కాలక్రమంలో దంపతుల మధ్య విభేదాలు, మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో భర్త మొరాదాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టులో 1955 హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ia)(ib) కింద విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశాడు. భార్య తన దత్తపుత్రికను మానసిక క్రూరత్వంతో అసభ్యకరంగా దూషించిందని అతడు ఆరోపించాడు.బంధువులు, స్నేహితుల ఎదుటే తన పరువు తీసేలా భార్య మాట్లాడేదని బాధిత భర్త తన పిటిషన్‌లో మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ ఫ్యామిలీ కోర్టు తీర్పు భర్తకు వ్యతిరేకంగానే వచ్చింది. దీంతో బాధిత వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్‌ వేశాడు. దీన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ దోనాడి రమేష్‌‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘‘ప్రేమ వివాహాలు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. అంతే వేగంగా వివాదాల్లో చిక్కుకొని, విడాకులతో కూలిపోతున్నాయి’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. బాధిత భర్త పిటిషన్‌ను కోర్టు సమర్ధించింది. ఫ్యామిలీ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. పరిస్థితులు, సందర్భాలను బట్టి ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల్లో ఎవరో ఒకరి తొందరపాటు వైఖరి, కలహ స్వభావం అనేది వివాహ బంధాన్ని కూల్చేస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed