Al Jazeera: ఆల్ జజీరా జర్నలిస్టులు ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ ఆరోపణ

by vinod kumar |   ( Updated:2024-10-24 09:26:48.0  )
Al Jazeera: ఆల్ జజీరా జర్నలిస్టులు ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖతార్‌కు చెందిన మీడియా సంస్థ ఆల్ జజీరాపై ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. గాజాలో పని చేస్తున్న ఆరుగురు జర్నలిస్టులు ఉగ్రవాదులని పేర్కొంది. వీరందరూ గాజాలోని హమాస్, ఇతర జిహాదీ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఆరోపించింది. అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్, తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉండగా.. అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్‌కు ఇస్లామిక్ జిహాద్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నారని తెలిపింది. ఈ ఆరుగురు జర్నలిస్టులు హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్టు వెల్లడించింది.

ఈ ఆరోపణలపై ఆల్ జజీరా తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ సైన్యం వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రాంతంలోని జర్నలిస్టులను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే అవాస్తవ ఆరోపణలు చేస్తోందని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం చేసిన యుద్ధ నేరాలను ఇటీవలే బయటపెట్టామని, అందుకే ఈ ఆరోపణలు చేసిందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులు, పౌర జనాభాపై బాంబు దాడి ఫలితంగా ఎదురవుతున్న మానవతా సంక్షోభాన్ని వెలికి తీస్తున్న ఏకైక అంతర్జాతీయ మీడియా నెట్‌వర్క్ ఆల్ జజీరా మాత్రమేనని వెల్లడించింది. సాక్ష్యాధారాలు అందించకుండా వాదనలు చేయడం సరికాదని పేర్కొంది.

కాగా, ఇటీవల గాజాలోని వెస్ట్ బ్యాంక్‌లో అల్ జజీరా కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. అల్ జజీరా తన కార్యాలయాన్ని 45 రోజుల పాటు మూసి ఉంచాలని ఆదేశించింది. ఇజ్రాయెల్‌లో అల్ జజీరా కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధించింది. ఇది జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే 2023లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో నలుగురు ఆల్ జజీరా జర్నలిస్టులు మరణించారు.

Advertisement

Next Story

Most Viewed