కీలక పరిణామం.. 25వేల కోట్ల స్కాంలో అజిత్ పవార్ భార్యకు క్లీన్‌చిట్

by Hajipasha |   ( Updated:2024-04-24 12:31:22.0  )
కీలక పరిణామం.. 25వేల కోట్ల స్కాంలో అజిత్ పవార్ భార్యకు క్లీన్‌చిట్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ వైపు విపక్ష నేతల చుట్టూ కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల ఉచ్చు బిగుస్తుండగా.. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అజిత్ పవార్‌కు ఊరటనిచ్చే కీలక ప్రకటన వెలువడింది. ఎంఎస్‌సీబీ బ్యాంకుకు సంబంధించిన రూ.25వేల కోట్ల కుంభకోణం కేసులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌కు మహారాష్ట్ర పోలీసు ఆర్థిక నేరాల విభాగం బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది.

ప్రధాని మోడీ లేవనెత్తిన స్కామే ఇది : ఉద్ధవ్ శివసేన

ఈ పరిణామంపై ఉద్ధవ్ శివసేన ఘాటుగా స్పందించింది. మహారాష్ట్ర పోలీసు ఆర్థిక నేరాల విభాగం నిర్ణయాన్ని ఖండించింది. ‘‘ఎంఎస్‌సీబీ బ్యాంకు కుంభకోణంపై తొలిసారిగా ఆరోపణలు లేవనెత్తింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే. పవార్ల కుటుంబం అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని గతంలో మోడీయే అన్నారు. ఇవాళ అందుకు భిన్నంగా అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్ ఇచ్చారు. బీజేపీతో చేయి కలిపే వారందరికీ క్లీన్ చిట్ ఇస్తున్నారు’’ అని ఉద్ధవ్ శివసేన పార్టీ నేత ఆనంద్ దూబే ఆరోపించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేతో తలపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed