వివాదంలో మరో బ్యూరోక్రాట్.. పూజా ఖేడ్ కర్ తర్వాత..

by Shamantha N |
వివాదంలో మరో బ్యూరోక్రాట్.. పూజా ఖేడ్ కర్ తర్వాత..
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్ కర్ వివాదాల్లో చిక్కుకున్నారు. దివ్యాంగురాలినని పేర్కొంటూ నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. కాగా.. ఈ నేపథ్యంలో మరో మాజీ ఐఏఎస్ ఎంపికపైన అనుమానాలు వస్తున్నాయి. 2011 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అభిషేక్ సింగ్‌ గతేడాది తన పదవికి రాజీనామా చేశారు. ఆతర్వాత నటుడిగా మారారు. ఆయన యూపీఎస్సీ ఎంపికలో రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొందేందుకు లోకోమోటర్ వైకల్యం ఉన్నట్లు పేర్కొన్నారు. అభిషేక్ సింగ్ కు చెందిన డాన్స్‌, జిమ్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. లోకోమోటర్ వైకల్యం ఉన్న వ్యక్తి ఇంత చక్కగా డాన్స్‌ ఎలా చేయగలుగుతారని ప్రశ్నలు సంధిస్తున్నారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఉద్యోగం పొందారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అభిషేక్ సింగ్ ఏమన్నారంటే?

ఈ ఆరోపణలపై అభిషేక్ సింగ్‌ స్పందించారు. రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ‘‘ఇప్పటివరకు నన్ను ఎవరూ విమర్శించలేదు. రిజర్వేషన్‌లకు మద్దతు ఇచ్చినప్పటినుంచి దాన్ని వ్యతిరేకించేవారు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నేను ఉద్యోగం సాధించింది రిజర్వేషన్‌తో కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని నేను నమ్ముతున్నాను. ఆ దిశగా కృషి చేస్తాను. మీకు ప్రతిభ ఉందని భావిస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మానేసి, వ్యాపారం, క్రీడలు లేదా నటనలో రాణించండి’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తనలో ప్రతిభ, విశ్వాసం, ధైర్యం, బలంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. ఇకపోతే, ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్ కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, యూపీఎస్సీకి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టేందుకు కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజాను పదవిని తొలగిచే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed