Murmu: ఎన్డీఏ ప్రభుత్వం మూడు రెట్లు వేగంగా పనిచేస్తోంది- ముర్ము

by Shamantha N |
Murmu: ఎన్డీఏ ప్రభుత్వం మూడు రెట్లు వేగంగా పనిచేస్తోంది- ముర్ము
X

దిశ, నేషనల్ బ్యూరో: మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. మూడు రెట్లు వేగంగా పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session) ప్రారంభం కాగా.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ప్రసంగించారు. కొన్నిరోజుల క్రితమే భారత 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలందరి తరఫున అంబేడ్కర్ సహా రాజ్యాంగనిర్మాతలందరికీ నివాళులర్పించారు. దేశంలో చారిత్రాత్మకమైన మహాకుంభమేళా కూడా జరుగుతోందన్నారు. భారదేశ సంస్కృతి సంప్రదాయం, సామాజిక స్పృహ ప్రతిబింబించే పండుగ ఇదే అని అన్నారు. కాగా.. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళులు అర్పించారు. “భారతదేశ అభివృద్ధి కోసం అమృత కాలంలో ఎన్డీఏ సర్కారు అపూర్వమైన విజయాల ద్వారా కొత్త శక్తిని నింపుతోంది. మూడో టర్మ్ లో మూడు రెట్లు వేగంగా పనిచేస్తుంది. దేశానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు, విధానాలను అసాధారణ వేగంతో అమలు చేసేందుకు చూస్తోంది. ఈ బడ్జెట్ లో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, యువతత, మహిళలు, రైతులకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది” అని ముర్ము అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలివే..

ప్రధానమంత్రి ఆవాస యోజనను విస్తరిస్తూ.. 3 కోట్ల మందికి గృహాలు అందించాలనే నిర్ణయం. ఇందుకోసం రూ. 5.36 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాం. స్వమిత్వా(SVAMITVA) పథకం కింద ఇప్పటివరకు 2.25 కోట్ల ఆస్తి కార్డులను జారీ చేశాం. గత ఆరు నెలల్లోనే 70 లక్షల ఆస్తి కార్డులను పంపిణీ చేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇటీవలే కోట్లాది మంది రైతులకు రూ. 41 వేల కోట్లు పంపిణీ చేశాం.

గిరిజను అభ్యున్నతి కోసం "ధర్తి ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్" ప్రచారం ప్రారంభించాం. అందుకు రూ.80 వేల కోట్లు కేటాయించాం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మందికి రూ.5 లక్షలతో ఆరోగ్య బీమా అందించాం, ముద్ర పథకం కింద రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాం.

ఉన్నత విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. నూతన విద్యా విధానంతో ఆధునిక విద్యా వ్యవస్థను ఏర్పాటుచేశాం. పేపర్ లీకేజీలను నివారించేందుకు, నియామకాలలో పారదర్శకతను నిర్ధారించేందుకు కొత్త చట్టం అమలు చేస్తున్నాం. ‘త్రిభువన్’ సహకార విశ్వవిద్యాలయాన్ని స్థాపించే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.

నాలుగో దశ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ. 70 వేల కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 71 వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. గత ఆరు నెలల్లో 17 కొత్త వందే భారత్ రైళ్లు, ఒక నమో భారత్ రైలు ప్రారంభమయ్యాయి.

సంస్కరణలు వేగవంతం చేశాం. ఒకే దేశం-ఒకే ఎన్నిక, వక్ఫ్‌ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం. త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్‌ మారనుంది.

పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నాం. 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చాం. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను వేగంగా అమలుచేస్తున్నాం.

ఉడాన్ పథకం ద్వారా దాదాపు రూ.1.5 కోట్ల మంది విమానంలో ప్రయాణించాలనే తమ కలను నెరవేర్చుకున్నారు. 80 శాతం రాయితీ ధరలకు మందులు అందించే జన ఔషధి కేంద్రాలు పౌరులకు రూ.30 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేయడంలో సహాయపడ్డాయి.

మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, స్టార్టప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతకు అనేక ఉపాధి అవకాశాలను సృష్టించాయి. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో 10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను అందించాం.

భారతదేశంలో ఇప్పుడు 1.5 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి రూ. వెయ్యి కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రారంభించాం.

QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్- 2025లో భారతదేశం రెండోస్థానంలో నిలిచింది. అదేవిధంగా, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. 76వ స్థానం నుండి 39వ స్థానానికి చేరుకుంది.

దేశంలో కార్పొరేట్‌ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఒలింపిక్‌ పతకాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారు. వారి సాధికారకతకు కృషి చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో డిజిటల్‌ సేవల కల్పనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

'ఒకే దేశం, ఒకే పన్ను' స్ఫూర్తితో జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తోంది.

మేక్ ఇన్ ఇండియా వంటి విధానాల కారణంగా, అనేక ప్రధాన ప్రపంచ బ్రాండ్లు ఇప్పుడు తమ ఉత్పత్తులపై 'మేడ్ ఇన్ ఇండియా' లేబుల్‌ను గర్వంగా ప్రదర్శిస్తున్నాయి.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు సాధికారికత కల్పిస్తున్నాం. 3 కోట్ల మందిని లక్‌పతీ దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌హౌస్‌గా మార్చడమే మా లక్ష్యం. నేషనల్ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించాం. కృత్రిమ మేధ రంగంలో ‘భారత ఏఐ మిషన్‌’ను మొదలుపెట్టాం.

భారత్‌ తన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ను ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదు.

ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంటీ పథకాలు, ఇ-కామర్స్‌ ఎగుమతి కేంద్రాలు దేశంలో అన్ని రంగాల్లో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయి.

సైబర్‌ సెక్యూరిటీలో సమర్థత కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. డిజిటల్‌ మోసాలు, సైబర్‌ నేరాలు, డీప్‌ఫేక్‌ వంటివి సామాజిక, ఆర్థిక, దేశ భద్రతకు పెను సవాళ్లుగా మారాయి.

ప్రపంచ వేదికపై డిజిటల్‌ టెక్నాలజీలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తోంది. మన యూపీఐ లావాదేవీల వ్యవస్థ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రశంసించాయి.

భారత మెట్రో నెట్‌వర్క్‌ 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచింది. ఇండియా AI మిషన్ ప్రారంభించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతదేశం యొక్క సహకారాన్ని పెంచుతున్నారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా 1.75లక్షల ఆరోగ్య మందిర్‌లను ఏర్పాటుచేశాం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం వారు ఉపయోగించే పలు ఔషధాలపై కస్టమ్‌ సుంకాన్ని రద్దు చేశాం. గర్భిణులు, పిల్లల వ్యాక్సినేషన్‌ కోసం యు-విన్‌ పోర్టల్‌ను ప్రారంభించాం.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సాగు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందిస్తున్నాం. కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు రూ.2000 కోట్లతో ‘మిషన్‌ మౌసం’ను ప్రారంభించాం. సహకార రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.

ఆర్టికల్‌ 370 తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగయ్యాయి. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనేవి ప్రభుత్వ పాలనకు బలమైన స్తంభాలుగా మారాయి.

సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రత కోసం ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. వామపక్ష అతివాదానికి వ్యతిరేకంగా పోరాటం చివరిదశకు చేరింది. నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కు తగ్గింది. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక అడుగులు వేస్తున్నాం.

వధవన్‌లో భారతదేశపు మొట్టమొదటి డీప్-వాటర్ మెగా పోర్ట్‌కు పునాది వేశాం. రూ. 76 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నన్న ఈ ఓడరేవు ప్రపంచంలోని టాప్ 10 ఓడరేవులలో ఒకటిగా నిలుస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న సిటీల సమీపంలో 12 పారిశ్రామిక నోడ్‌లను స్థాపించడానికి, 100 పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి ప్రభుత్వం సుమారు రూ.28 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.

సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతలో ఈ ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచింది. మన ముందున్న ఏకైక లక్ష్యం.. ‘వికసిత్‌ భారత్‌’ నిర్మాణమే..!

పది సంవత్సరాల క్రితం, మూలధన బడ్జెట్ దాదాపు రూ.2 లక్షల కోట్లుగా ఉంది. గత బడ్జెట్ లో అది రూ.11 లక్షల కోట్లకు చేరింది.

Next Story

Most Viewed