నిరాశపరిచిన రుతుపవనాలు.. తక్కువ వర్షపాతం నమోదు: ఐఎండీ

by Harish |
నిరాశపరిచిన రుతుపవనాలు.. తక్కువ వర్షపాతం నమోదు: ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: గత ఏడాది నిరాశపరిచిన రుతుపవనాలు ఈ సారి మాత్రం సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే దేశంలోకి అడుగుపెట్టాయి. దీంతో వర్షాలు బాగా కురుస్తాయని అంచనా వేసినప్పటికీ జూన్ 1 న రుతుపవనాల కాలం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశంలో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఎన్నడూ లేని విధంగా వర్షాలపై ఆశలు చిగురిస్తూ రుతుపవనాలు కేరళలోకి మే 30 నాటికి ప్రవేశించాయి. ఆ తరువాత జూన్ 12 నాటికి కేరళ, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలను వేగంగా చేరుకున్నప్పటికి జూన్ 12- 18 మధ్య వర్షాల విషయంలో పెద్ద పురోగతిని సాధించలేదని, ఇంకా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయని, ఈ ప్రాంతాలు ఇప్పటికి వర్షాల కోసం వేచి చూస్తున్నాయని ఐఎండీ పేర్కొంది.

ఐఎండీ డేటా ప్రకారం, జూన్ 1-18 మధ్య భారతదేశంలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఎ) 80.6 మిమీ కంటే 20 శాతం తక్కువ. అదే ప్రాంతాల వారీగా తీసుకుంటే, జూన్ 1 నుండి వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే 70 శాతం తక్కువ, మధ్య భారతదేశంలో 31 శాతం తక్కువ, తూర్పు, ఈశాన్య భారతదేశంలో 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది, అదే సమయంలో దక్షిణ ద్వీపకల్పంలో 16 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదిలా ఉంటే రానున్న మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లలో రుతుపవనాలు మరింత చురుగ్గా ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story