- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bhagwant Mann: పంజాబ్ లో ప్రభుత్వ మార్పు.. సీఎంగా కేజ్రీవాల్..!

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు జరగొచ్చంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలోని కపుర్తలా హౌస్‌లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann), ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. అయితే, పంజాబ్ సీఎం పదవి నుంచి ఆయన్ని తప్పిస్తారని వస్తున్న వార్తలను మాన్ నవ్వుతూ తోసిపుచ్చారు. అయితే, పార్టీలో ఇలాంటి భేటీ జరగడం సర్వసాధారణమని, భవిష్యత్ కార్యచరణపై చర్చించామని మాన్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పనిచేసినందుకు ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. అంతేకాకుండా,ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. గెలుపుఓటములు రాజకీయాల్లో భాగమని అన్నారు. "ఢిల్లీలో ప్రజల తీర్పును మేము అంగీకరిస్తున్నాం. ఇప్పుడు పంజాబ్‌ను మోడల్ రాష్ట్రంగా మార్చాలని మేము ప్లాన్ చేస్తున్నాము" అని ఆయన అన్నారు. కేజ్రీవాల్ తో అందరూ ఎమ్మెల్యేలు భేటీ కావాలనుకున్నారని.. అందుకే ఢిల్లీకి వచ్చారని మాన్ అన్నారు.
ఆరోపణలపై ఏమన్నారంటే?
భగవంత్ మాన్ ని అసమర్థుడిగా ముద్రవేసి ఆయన స్థానంలో పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్ నిలవాలనుకుంటున్నారనే ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఈ ఆరోపణలపై మాన్ నవ్వి "వారు చెప్పనివ్వండి" అని అన్నారు. పంజాబ్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా రూ.1,000 ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు, ఆప్ పంజాబ్ పార్టీ యూనిట్‌లో సఖ్యత లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే 30 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్‌సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆప్ పరాజయంతో భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్నారు. అలాగే ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భగవంత్ మాన్ స్పందించారు. దాదాపు మూడు సంవత్సరాలుగా బజ్వా ఈ విషయాన్నే చెబుతున్నారని అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కు వరుసగా మూడోసారి ఒక్కసీటు రాలేదని బజ్వాను ఉద్దేశించి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యను మూడోసారి లెక్కించమని చెప్పండి అని చురకలు అంటించారు. అంతకుముందు, ఆప్ ఎంపీ మాల్విందర్ స్పందించారు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో టచ్‌లో లేరని దుయ్యబట్టారు. తన సోదరుడు బీజేపీలో చేరితేనే బజ్వా ఆపలేకపోయారని మాల్విందర్ ఎద్దేవా చేశారు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు సొంత పార్టీని వీడుతుంటే.. బజ్వా ఆప్ ఎమ్మెల్యేల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు. ఇకపోతే, 117 మంది సభ్యులు గల పంజాబ్ అసెంబ్లీలో ఆప్‌కు 93 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.