ఇతర ఖైదీల దాడిలో మరణించిన ముంబై వరుస పేలుళ్ల నిందితుడు

by Harish |
ఇతర ఖైదీల దాడిలో మరణించిన ముంబై వరుస పేలుళ్ల నిందితుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడిగా కొల్హాపూర్‌లోని కలంబ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 59 ఏళ్ల మున్నా అలియాస్ మహ్మద్ అలీ ఖాన్ అలియాస్ మనోజ్ కుమార్ భవర్‌లాల్ గుప్తాపై ఆదివారం కొంతమంది ఇతర ఖైదీలు దాడి చేశారు. తీవ్ర గాయాలై కింద పడిపోయిన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జైలులోని బాత్రూమ్‌లో స్నానం చేయడం విషయంలో అండర్ ట్రయల్ ఖైదీలతో వాగ్వాదం జరిగింది. దీంతో అవతలి వారు ఇతనిపై దాడి చేశారు. వారు డ్రైనేజీ ఇనుప రాడ్‌తో ఖాన్ తలని పగులగొట్టారు, దాంతో అతను నేలపై కుప్పకూలిపోయాడు.

సమాచారం అందుకున్న జైలు సిబ్బంది అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినప్పటికీ అతను చనిపోయాడు. దాడి చేసిన వారిని ప్రతీక్ అలియాస్ పిల్యా సురేష్ పాటిల్, దీపక్ నేతాజీ ఖోట్, సందీప్ శంకర్ చవాన్, రీతురాజ్ వినాయక్ ఇనామ్‌దార్, సౌరభ్ వికాస్‌లుగా గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితులపై కొల్హాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మార్చి 12, 1993న ముంబైలో జరిగిన ఒకే రోజు వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా,1,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఉగ్రవాద చర్యకు సంబంధించి కొంతమందిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed