Punjab: అమృత్‌సర్‌ ఎన్నారై ఇంట్లో కాల్పుల కేసులో 5 మంది అరెస్ట్

by Harish |   ( Updated:2024-08-25 06:39:51.0  )
Punjab: అమృత్‌సర్‌ ఎన్నారై ఇంట్లో కాల్పుల కేసులో 5 మంది అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం ఉదయం ఇద్దరు దుండగులు ఎన్నారై సుఖ్‌చైన్ సింగ్ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. సుఖ్‌చైన్ సింగ్ మొదటి భార్య కుటుంబం ఈ దారుణానికి పాల్పడిందని అమృత్‌సర్ కమిషనర్ రంజిత్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఆమె కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అమెరికాలో స్థిరపడ్డారు. వారు సుఖ్‌చైన్ సింగ్‌ను చంపడానికి హంతకులకు సుపారీ ఇచ్చారు. ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా అమెరికాలో రూపొందించారు. ఇది రెండు కుటుంబాల మధ్య వివాదం అని ఆయన చెప్పారు.

రెండేళ్ల క్రితం అతని మొదటి భార్య ఆత్మహత్య చేసుకోగా, సుఖ్‌చైన్ సింగ్‌పై ఆమె కుటుంబసభ్యులు ప్రతీకారంతో ఈ నేరానికి పాల్పడ్డారు. అరెస్ట్ అయిన వారిలో సుఖ్‌చైన్ సింగ్ మొదటి భార్య తండ్రి ఉన్నాడు, అలాగే నేరానికి ముందు, తర్వాత దుండగులకు ఆశ్రయం ఇచ్చినందుకు అమృత్‌సర్‌లో ఉన్న హోటల్ సిబ్బంది గదాంబర్ అత్రి, అభిలాష్ భాస్కర్‌ను కూడా అరెస్టు చేశారు. మరో ఇద్దరు జగ్జిత్ సింగ్, చమ్‌కౌర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

దాడి చేసిన వారిని కపుర్తలాలోని ఘరేనాడేకి చెందిన గురిందర్ సింగ్ సుఖా, జలంధర్‌కు చెందిన గుర్కీరత్ సింగ్ గురి గా పోలీసులు గుర్తించారు. అమెరికా నుంచి భారత్‌కు జరిగిన నగదు లావాదేవీపై కూడా విచారణ జరుగుతోందని, త్వరలో మరికొందరిని కూడా అరెస్టు చేస్తామని కమిషనర్ చెప్పారు. ఈ ఘటనలో బాధితునికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదు.

Advertisement

Next Story