Bangladesh : బంగ్లాదేశ్ అల్లర్లలో 93 మంది మృతి.. ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన

by Hajipasha |   ( Updated:2024-08-04 16:40:53.0  )
Bangladesh : బంగ్లాదేశ్ అల్లర్లలో 93 మంది మృతి..  ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ మళ్లీ అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆదివారం రోజు దేశ రాజధాని ఢాకా సహా 13 జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు, అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 93 మంది చనిపోయారు. వందలాది మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘‘స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్’’ వేదిక ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆదివారం ప్రారంభించాయి. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో జరిగిన హింసాకాండలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా రోడ్లపైకి పెద్దసంఖ్యలో వచ్చి నిరసన తెలుపుతున్న విద్యార్థులను అడ్డుకునేందుకు అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఢాకా శివార్లలోని మున్షిగంజ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణలో పెట్రోల్ బాంబులు పేలినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి దేశంలో నిరవధిక కర్ఫ్యూను అమలు చేస్తామని వెల్లడించింది. ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను తాత్కాలికంగా షట్ డౌన్ చేయాలనే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను ఆపేయాలని మొబైల్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది.

నేడు ధర్నాలు, రాస్తారోకోలు

స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఇటీవల జరిగిన ఘర్షణల్లో చనిపోయిన వారి పేరిట సోమవారం రోజు దేశవ్యాప్తంగా శిలాఫలకాలను ఆవిష్కరిస్తామని నిరసనకారులు ప్రకటించారు. ప్రధాని రాజీనామాను కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని వెల్లడించారు. నిరసనకారులతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమని ప్రధానమంత్రి షేక్ హసీనా శనివారమే ప్రకటించినప్పటికీ అందుకు విద్యార్థి సంఘాలు నో చెప్పాయి. ఆదివారం జరిగిన ఘర్షణల్లో పెద్దసంఖ్యలో ప్రజలు మరణించిన నేపథ్యంలో ప్రధాని హసీనా కీలక ప్రకటన చేశారు. ఈ నిరసనల్లో పాల్గొంటున్నవారు విద్యార్థులు కాదని.. వాళ్లంతా టెర్రరిస్టులని ఆమె కామెంట్ చేశారు. వారందరినీ ఉక్కు పిడికిలితో అణచివేయాలని ప్రజలకు హసీనా పిలుపునిచ్చారు. ఆర్మీ, భద్రతా బలగాలతో ఆదివారం సమావేశమైన బంగ్లాదేశ్ ప్రధాని దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు.

ఎంబసీతో టచ్‌లో ఉండండి.. భారతీయులకు అలర్ట్

బంగ్లాదేశ్‌లో హింసాకాండ నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఆ దేశంలో ఉంటున్న భారతీయులు అక్కడున్న భారత రాయబార కార్యాలయతో టచ్‌లో ఉండాలని సూచించింది. ఏదై అత్యవసరమైతే +88-01313076402 ఫోన్ నంబరుకు కాల్ చేయాలని బంగ్లాదేశ్‌లోని సిల్హట్‌లో ఉన్న అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం కోరింది.

Advertisement

Next Story