Chandipura: గుజరాత్‌లో చండీపురా వైరస్‌తో 28 మంది పిల్లలు మృతి

by Harish |
Chandipura: గుజరాత్‌లో చండీపురా వైరస్‌తో 28 మంది పిల్లలు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: చండీపురా వైరస్ కేసులు గుజరాత్ రాష్ట్రంలో భారీగా నమోదవుతున్నాయి. దీనిని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ అది వేగంగా విస్తరిస్తూనే ఉంది. దీని కారణంగా చాలా మంది పిల్లలు మరణిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ మాట్లాడుతూ, జులైలో మొదటి కేసు నమోదైనప్పటి నుండి చండీపురా వైరస్ కారణంగా గుజరాత్‌లో 14 ఏళ్లలోపు 28 మంది చిన్నారులు తమ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 164 వైరల్ ఎన్సెఫాలిటిస్ కేసులు నమోదు కాగా, చండీపురా వైరస్‌తో సహా కొన్ని వ్యాధికారక కారకాల వల్ల 101 మంది పిల్లలు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు గుర్తించిన ఈ 164 కేసుల్లో 61 చాందీపురా వైరస్‌ వల్ల వచ్చినవే, 28 మంది పరిస్థితి క్షీణించి మృతి చెందారు. 73 మంది ఇతర వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ల వల్ల మెదడువాపుకు గురయ్యారు. 63 మంది చిన్నారులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు, నలుగురు ఇంకా వైద్య సంరక్షణలో ఉన్నారని మంత్రి తెలిపారు.

పరిస్థితి అదుపులో ఉందని, గత వారంలో కొత్త కేసులేవీ నమోదు కాలేదని, గత 12 రోజులుగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని ఆయన అన్నారు. చండీపురా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్ ప్రారంభించింది. ఈ డ్రైవ్ కింద, వైరల్ ఎన్సెఫాలిటిస్,చండీపురా కేసులు బయటపడిన ప్రాంతాల్లోని 53,000 ఇళ్లను ఆరోగ్య బృందాలు సర్వే చేశాయి.

Advertisement

Next Story

Most Viewed