- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024 ‘వరల్డ్ ఎలక్షన్ ఇయర్’..ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : 2024 వచ్చేసింది.. ఈ సంవత్సరం ఎన్నో దేశాలు, ఎంతోమంది ప్రపంచ నేతల భవితవ్యాన్ని నిర్ణయించబోతోంది. దాదాపు 70కిపైగా దేశాల అధికార పీఠాలను అధిరోహించేది ఎవరనేది ఈ ఏడాదిలోనే తేలనుంది. ప్రపంచ జనాభాలో సగానికిపైగా నెలవై ఉన్న ఈ దేశాల్లో జరగబోయే ఎన్నికల్లో వచ్చే తీర్పు అనేది అంతర్జాతీయ సమాజం పోకడలపై గణనీయ ప్రభావాన్ని చూపించనుంది. ఎందుకంటే.. ఆయా దేశాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వాల విధానాలు, వ్యూహాలు.. మునుపటి ప్రభుత్వాల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా వాటి విదేశీ సంబంధాలు, వాణిజ్య ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, సైనిక వ్యూహాలు మారిపోతాయి. ఫలితంగా ఆ 70కిపైగా దేశాల ప్రజలతో పాటు వాటి ఇరుగుపొరుగు దేశాల ప్రజలు కూడా ఒక కొత్త మార్పును ఫీల్ అవుతారు.
భారత్, పొరుగుదేశాలలో ఇదీ పరిస్థితి..
భారత్ పొరుగున ఉన్న చాలా దేశాల్లో 2024 సంవత్సరం ఆరంభంలోనే ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బంగ్లాదేశ్‌లో జనవరి 7న, పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న ఓట్ల జాతర జరగబోతోంది. భూటాన్‌లో రెండోదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను జనవరి 9న నిర్వహించనున్నారు. భారత్‌లో ఎన్నికల సందడి మార్చి నాటికి ప్రారంభమై.. ఏప్రిల్ - మే మధ్య పోలింగ్ జరుగుతుంది. దాదాపు 94 కోట్ల మంది భారతీయులు ఓటుహక్కును వినియోగించుకుంటారు. ఇక మరో పొరుగుదేశం చైనాలో ఈ సంవత్సరం ఎన్నికలు లేవు. కానీ జనవరి 13న జరిగే తైవాన్ సాధారణ ఎన్నికల తర్వాత చైనా తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారుతాయి. తైవాన్‌ను తమ దేశంలో విలీనం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పదేపదే చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా భారత్‌తో సన్నిహిత సంబంధాలనే నెరుపుతోంది. అక్కడ ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీయే మళ్లీ గెలిచే వాతావరణం కనిపిస్తోంది. ఇక పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ వైపే గాలి వీస్తోంది. ‘‘భారత్‌తో స్నేహానికి నేను రెడీ.. గతంలో నాకు తెలియకుండా పర్వేజ్ ముషారఫ్ కార్గిల్‌లో కబ్జాలు చేశాడు’’ అని ఇటీవల నవాజ్ వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆయన మైండ్‌లో ఏం నడుస్తోందో మనం అంచనా వేయొచ్చు. శ్రీలంకలో 2024లో పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇండియా, చైనా పోటీపడుతున్నాయి. కొత్త ప్రభుత్వం వైఖరి అనేది ఈ రెండు దేశాలకు కీలకంగా మారుతుంది.
అమెరికా తీర్పు.. ప్రవాస భారతీయులకు కీలకం
ఈ ఏడాది నవంబరులో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అంతకంటే ముందు 2024 జనవరి నుంచి రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థుల ఎంపికకు కసరత్తును మొదలుపెడతాయి. ఈ ప్రక్రియను ‘ప్రైమరీ’ అని పిలుస్తారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఆయన పోటీకి అనర్హుడని ఇప్పటికే రెండు కోర్టులు తీర్పు ఇచ్చాయి. ఈ పరిణామాలు ట్రంప్ పోటీకి పెద్ద అడ్డుగోడగా నిలిచే అవకాశం ఉంది. వీటిపై జనవరిలో అమెరికా సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ట్రంప్ రాజకీయ భవితవ్యం డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఆయనకు ఛాన్స్ గల్లంతైతే రిపబ్లికన్ పార్టీ తరఫున భారత సంతతి నేతలు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ అధ్యక్ష అభ్యర్ధిత్వ బరిలో తలపడతారు. మరోవైపు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నప్పటికీ.. ఆయన వయసు ఇప్పటికే 80 దాటడం పెద్ద మైనస్ పాయింట్‌గా మారే రిస్క్ ఉంది. ఇక్కడ ఏర్పడే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రభావం లక్షలాది మంది ప్రవాస భారతీయులపై పడుతుంది.
పుతిన్‌కే మళ్లీ పట్టం.. ?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. వరుసగా ఐదోసారి తానే దేశ అధ్యక్షుడు కావాలనే పట్టుదలతో ఉన్నారు. మార్చి 15 నుంచి 17 వరకు ఆ దేశంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా నిమగ్నమై ఉంది. ఇలాంటి కీలక తరుణంలో పుతిన్‌ను కాదని మరో వ్యక్తి చేతికి దేశం పగ్గాలను అప్పగించే సాహసాన్ని రష్యా ప్రజలు చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. 2024 డిసెంబర్ 19న బ్రిటన్ పార్లమెంటు రద్దు కానుంది. ఆ వెంటనే ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఆ దేశ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఉన్నారు. ఇక 700కుపైగా సీట్లున్న యూరోపియన్ యూనియన్‌లో ఈ ఏడాది జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయి. 27 యూరోపియన్ దేశాలకు చెందిన 40 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకుంటారు.మెక్సికో, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఇండోనేషియా దేశాల పార్లమెంటరీ ఎన్నికలు కూడా ఈ ఏడాదే జరుగుతాయి. మొత్తం మీద 15 ఆఫ్రికన్ దేశాలు, 9 అమెరికన్ దేశాలు, 11 ఆసియా దేశాలు, 22 యూరోపియన్ దేశాలు, ఓసీనియాలోని నాలుగు దేశాలు ఈ ఏడాది ఎన్నికలకు వెళ్లనున్నాయి.