Biswa sharma: అక్రమ చొరబాట్లకు టెక్స్ టైల్ ఇండస్ట్రీ యజమానులే కారణం.. అసోం సీఎం బిస్వ శర్మ

by vinod kumar |
Biswa sharma: అక్రమ చొరబాట్లకు టెక్స్ టైల్ ఇండస్ట్రీ యజమానులే కారణం.. అసోం సీఎం బిస్వ శర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి జరుగుతున్న అక్రమ చొరబాట్లకు దేశంలోని టెక్స్ టైల్ ఇండస్ట్రీ (Textile industry) యజమానులే కారణమని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himanth biswa sharma) ఆరోపించారు. వస్త్ర పరిశ్రమలలోని ఒక విభాగం బంగ్లాదేశ్ నుంచి తక్కువ ధరకు పని చేసే కార్మికులను చట్టవిరుద్ధంగా దిగుమతి చేస్తోందని, అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో టెక్స్‌టైల్ పరిశ్రమ కుప్పకూలిందని దీంతో ఈ చర్యలు మరింత పెరిగాయని తెలిపారు. బుధవారం ఆయన గౌహతి(Guvahati)లో మీడియాతో మాట్లాడారు. ఈ సమస్యపై కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని, కార్మికుల రూపంలో భారతదేశానికి వచ్చేలా ప్రజలను ప్రోత్సహిస్తున్న పారిశ్రామిక సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ విషయమై రెండు రోజుల క్రితం ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతోనూ చర్చించినట్లు తెలిపారు. ‘అసోం పోలీసులు ప్రతిరోజూ 20 నుంచి 30 మంది చొరబాటుదారులను గుర్తిస్తున్నారు. త్రిపురలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఇలా ఎందుకు జరుగుతోందని తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టినప్పుడు బంగ్లాదేశ్‌లో అశాంతి తర్వాత వస్త్ర పరిశ్రమ పడిపోయినట్టు గమనించాం’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1,000 మంది చొరబాటుదారులను గుర్తించి వెనక్కి పంపించామన్నారు. ఇది చాలా అందోళన కలిగించే అంశమని ఇంతకు ముందెన్నడే ఈ స్థాయిలో చొరబాట్లను గుర్తించలేదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed