14ఏళ్ల రేప్ బాధితురాలి అబార్షన్‌కు అనుమతి..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

by samatah |
14ఏళ్ల రేప్ బాధితురాలి అబార్షన్‌కు అనుమతి..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన ఓ 14ఏళ్ల బాలిక అబార్షన్ చేయించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గర్భం కొనసాగించడం వల్ల బాలిక శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. బాలికకు వెంటనే అబార్షన్ చేయాలని ముంబైలోని లోక్ మాన్య తిలక్ ఆస్పత్రిని ఆదేశించింది. అంతకుముందు బాంబే హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. కాగా, మహారాష్ట్రకు చెందిన 14ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. దీంతో తన కుమార్తెకు అబార్షన్‌కు అనుమతించాలని బాధితురాలి తల్లి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అయితే వైద్య పరంగా అబార్షన్ చేసేందుకు కాల పరిమితి(24వారాలు) దాటి పోవడంతో బాంబే హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే బాలిక తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 19న అత్యవసర విచారణ చేపట్టిన ధర్మాసనం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. పరీక్షలు నిర్వహంచిన అనంతరం ఆ వివరాలను మెడికల్ బోర్టు సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ నివేదిక ఆధారంగానే ధర్మాసనం అబార్షన్‌కు అనుమతించింది. బాలిక శ్రేయస్సు దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. పిటిషనర్‌తో పాటు ఆమె కుమార్తెను సురక్షితంగా ఆస్పత్రికి తరలించేలా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed