ఆందోళన కలిగిస్తోన్న సర్వే.. డేంజర్ జోన్‌లో 70% మంది చిన్నారులు

by Anukaran |   ( Updated:2021-09-08 01:44:38.0  )
ఆందోళన కలిగిస్తోన్న సర్వే.. డేంజర్ జోన్‌లో 70% మంది చిన్నారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ప్రభావం అందరితో పాటు చిన్నారుల ఆరోగ్యంపై కూడా చూపింది. కొవిడ్ పరిస్థితుల్లో గర్భిణీలు, చిన్నారులకు ప్రభుత్వం నుంచి సకాలంలో పోషకాహారం అందని కారణంగా రక్తహీనత సమస్య పెరుగుతోంది. రాష్ర్ట వ్యాప్తంగా ఏకంగా 70 శాతం మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అర్బన్‌లో 64.7, రూరల్‌లో 72.8 శాతం మందికి ఈ సమస్య ఉందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లోనూ పొందుపరిచారు.

కరోనా కంటే ముందు ఎన్ఎఫ్ హెచ్ 4తో పోల్చితే ప్రస్తుతం అనీమియా బాధితులు 10 శాతం పెరగడం ఆందోళనకరం. వీరిలో అత్యధికంగా 6 నుంచి 59 నెలల చిన్నారులు ఉన్నారు. అయితే అనీమియా ముప్పు అత్యధికంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలపై ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో ఆ జిల్లాల్లో ప్రత్యేకంగా స్ర్కీనింగ్ ప్రక్రియను ఏర్పాటు చేసి బాధితులకు వేగంగా చికిత్సను అందించాలని ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నది. అంతేగాక మిగతా జిల్లాల్లోనూ అనీమియా ప్రభావ పరిస్థితులకు అనుగుణంగా నివారణ చర్యలు ఏర్పాటు చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు రాష్ర్ట వైద్యారోగ్యశాఖకు సూచించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు జిల్లాల్లోని క్షేత్రస్థాయి అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

6 నుంచి 59 నెలల చిన్నారుల్లోనే ఎందుకు?

తల్లిగర్భంలో శిశువు ఉన్నప్పుడు హైపోక్సియా కారణంగా హిమోగ్లోబిన్ శాతం చాలా ఎక్కువగా 19 గ్రాములు ఉంటుంది. కానీ శిశువు పుట్టిన తర్వాత బయట ఆక్సిజన్ వలన హైపోక్సియా తగ్గి హిమోగ్లోబిన్ సాధారణంగా తగ్గుతుంది. దీంతో రక్తహీనత వస్తుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. అదే విధంగా పుట్టిన ఆరు నెలల పాటు తల్లిపాలను సక్రమంగా తీసుకోవడంతో పాటు, ఆ తర్వాత కూడా పోషకాహారాన్ని సరైన సమయంలో తీసుకోవాలి. అంతేగాక పాలిచ్చే తల్లులు ఐరన్ శాతం అధికంగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. లేదంటే బిడ్డకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. అదే విధంగా బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఐరన్, విటమిన్ సీ, డీ కలిగిన పండ్లు, ప్రూట్స్, ఆహారాన్ని తప్పనిసరిగా తల్లి, బిడ్డలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరెంజ్, తాజా ఆకుకూరలు, డేట్స్ తదితరవి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో హిమోగ్లోబిన్ శాతం మెరుగ్గా ఉంటుందని డాక్టర్లు వివరిస్తున్నారు.

చిన్నారులకూ వస్తుందని అవగాహన కల్పించాలి

Dr Manjula Anagani

చిన్నారులకూ రక్తహీనత వస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలి. దీనికి ప్రజలు, ప్రభుత్వాలు, మీడియాలు సంయుక్తంగా కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా గ్రామాల్లో విస్రృతంగా చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేగాక చిన్నారుల్లో బ్లడ్ ఉత్పత్తిని కూడా చెక్ చేయాలి. దీంతో పాటు చిన్నారుల శరీరంలో నులిపురుగులు ఉన్నాయో లేదో పరిక్షించాలి. అనీమియా నిర్మూలనను మిషన్ లాగా తీసుకొని అవగాహన చేపట్టాలి. నార్మల్‌గా బిడ్డ పుట్టినప్పుడు హిమోగ్లోబిన్ పరిమాణం 19 గ్రాములు ఉంటుంది. కానీ బేబీ బయటకు వచ్చిన తర్వాత బయట ఆక్సిజన్ వలన 12 గ్రాములకు తగ్గుతుంది. కానీ 11కి తగ్గిందంటే పరిస్థితి తీవ్రంగా ఉందని అర్ధం చేసుకోవాలి. దీనికి సరైన శాతంలో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో సదరు చిన్నారులకు దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నది.
-డాక్టర్ మంజులా అనగాని, క్లినికల్ డైరెక్టర్ హెచ్ఓడీ

Advertisement

Next Story