- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సిట్టింగ్’ కేంద్రంగా మారిన ‘మోడల్ మార్కెట్’..
దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గంలోని అదే పట్టణంలో ఏటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మార్కెట్ లేదు. పట్టణంలో చాలా వరకు రోడ్లపైనే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నానాటికీ పెరుగుతున్న జనాభా కారణంగా కొనుగోలు ప్రాంతాల్లో రద్దీ, ట్రాఫిక్ సమస్య పెరుగుతూ వస్తోంది. నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్లో ప్రతీ ఆదివారం జరిగే మార్కెట్‌కు పట్టణం నుండే కాకుండా డివిజన్లోని ఆరు మండలాల పరిధిలోని గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ప్రజలకు నాణ్యమైన, తాజా కూరగాయలను అందించడానికి మోడల్ రైతు బజార్‌ను రూ. 2 కోట్లతో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అనుకున్నదే తడవుగా మోడల్ రైతు బజార్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెలలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఈ మాడల్ రైతు బజార్‌ను ప్రారంభించారు.
మందుబాబులకు అడ్డా..
నర్సంపేట పట్టణవాసులకు నాణ్యమైన కూరగాయల్ని అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మోడల్ రైతు బజార్ మందు బాబులకు అడ్డాగా మారింది. మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించి ఐదు నెలలు దాటినా నేటికీ అందులో క్రయవిక్రయాలు జరగట్లేదు. సాయంత్రం వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికవుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కూరగాయల అమ్మకాలు ఎప్పటిలాగానే రోడ్లపై కొనసాగుతున్నాయి. మోడల్ రైతు బజార్ వినియోగంలో లేకపోవడంతో అపరిశుభ్రంగా మారిపోయింది. ఇదే అదనుగా భావించిన మందు బాబులు దీనిని సిట్టింగ్‌కు అడ్డాగా చేసుకున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఎక్కడ చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి.
ఆర్భాటం చేసి వదిలేశారు.
మోడల్ రైతు బజార్ ఏర్పాటు చేస్తున్నారని తెలియడంతో పట్టణ ప్రజలు సంతోషపడ్డారు. తాజా కూరగాయలు సరసమైన ధరలకు, నాణ్యమైనవి దొరుకుతాయని ఆశ పడ్డారు. కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆర్భాటంగా మొదలెట్టారు కానీ ఆచరణలో మాత్రం సాధ్యపడలేదు. కానీ లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మోడల్ రైతు బజార్ ఇన్ని నెలలు అవుతున్నా ఎందుకు ఆచరణలోకి తీసుకురావట్లేదన్న ప్రశ్న పట్టణవాసుల్ని తొలుస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ లక్షల ప్రజాధనం వృథా అయ్యిందని పట్టణవాసులు వాపోతున్నారు.
రోడ్డు మీదే పార్కింగ్..
నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు దగ్గరలో ఉన్న అంగడి సెంటర్లో రోడ్లపైనే కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయి. మోడల్ రైతు బజార్ వినియోగంలో లేకపోవడంతో కూరగాయలు అమ్ముకునే వారు పోటీలు పడి మరీ రోడ్లపైకి వస్తున్నారు. మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు తమ వాహనాల్ని రోడ్లపై పార్కింగ్ చేయడంతో నిముషాల్లోనే ఈ ప్రాంతమంతా రద్దీగా మారిపోతోంది. మార్కెట్‌కు సరైన పార్కింగ్ ప్లేస్ లేకపోవడం, రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముతుండటంతో ఆదివారం నాడు అంగడి సెంటర్ రోడ్లో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరుగుతోంది.
పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలి..
ఉదయం పూట కూరగాయల కోసం వచ్చే వారి ద్విచక్ర వాహనాలతో అంగడి సెంటర్ అంత కిక్కిరిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కోసారి పోలీసులు రాంగ్ పార్కింగ్ పేరిట చలానాలు వేస్తుండటం కొనుగోలు దారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. చవకగా కూరగాయలు కొనడానికి వస్తే వందలకు వందలు జరిమానాలు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై శ్రద్ధ వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
- Tags
- drunkers