AP News: జగన్ కు లోకేష్ శాపనార్ధాలు.. ఈ పాపం ఊరికే పోదంటూ ట్వీట్

by srinivas |   ( Updated:2021-09-06 04:47:29.0  )
AP News: జగన్ కు లోకేష్ శాపనార్ధాలు.. ఈ పాపం ఊరికే పోదంటూ ట్వీట్
X

దిశ, ఏపీ బ్యూరో: ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ అనే నిబంధన వల్ల రాష్ట్రంలో అనేక మంది వృద్ధులు పింఛన్ కోల్పోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వృద్ధుల‌కు పెన్ష‌న్లు అంద‌కుండా పోతుండ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఇటీవల కాలంలో 2.30 లక్షల పెన్షన్లు రద్దు చేసి అవ్వా తాతలకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. జగన్ సర్కార్ పెడుతున్న మానసిక క్షోభ భరించలేక పెన్షన్‌పై ఆధారపడి బతుకుతున్న 13 మంది వృద్ధులు మరణించారని చెప్పుకొచ్చారు.

అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న సీఎం.. ఇప్పుడు తుంచుకుంటూ పోతున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్‌గా రూ.3వేలు ఇస్తానని ఆశచూపి మోసం చేశారని లోకేశ్ మండిపడ్డారు. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి.. ఇప్పుడు కోతలు విధిస్తున్నారంటూ విమర్శించారు. ప్రతి ఏడాది రూ.250 పెంచుకుంటూ పోతామన్న హామీ ప్రకారం నేడు పెన్షన్ రూ.2,750 ఇవ్వాలని.. అయితే అలా ఇవ్వకుండా పెన్షన్లు కోసేస్తున్నారని.. ఈ పాపం ఊరికేపోదంటూ లోకేశ్ శాపనార్థాలు పెట్టారు. ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారి పెన్షన్లు తీసేయడం సరికాదని హితవు పలికారు. ఎత్తేసిన పెన్షన్లు అన్నీ వెంటనే ఇవ్వాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story