ఫీవర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బెడ్స్ ఫుల్

by Shyam |
ఫీవర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బెడ్స్ ఫుల్
X

దిశ, అంబర్ పేట్ : నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో కరోనా రోగులు పడరాని పాట్లు పడుతున్నారు.100 పడకల సామర్ధ్యం గల ఈ హాస్పిటల్ సీజనల్ వ్యాధుల చికిత్సలకు ఎంతో గుర్తింపు పొందింది. కాగా గత యేడాది కోవిడ్ మొదలైన నాటి నుండి సీజనల్ వ్యాధులతో పాటు కరోనాకు వైద్యం అందిస్తున్నారు. కరోనా, కరోనేతర జబ్బులకు వైద్యం అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆస్పత్రిలో వసతుల లేమి వైద్యులతో పాటు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రతినిత్యం వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. ఇంత మందికి వైద్య పరీక్షలు అందించేందుకు ఇక్కడ వసతులు సమకూర్చకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

కరోనా రోగులకు అరకొర వసతులు..

ఫీవర్ ఆస్పత్రిలో కరోనా రోగులు అరకొర వసతులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడికి ప్రతినిత్యం వందల సంఖ్యలో కోవిడ్ రోగులు వస్తున్నారు. ఇలా వచ్చిన వారికి పరీక్షలు జరిపి పాజిటివ్ వచ్చిన వారిలో అత్యవసరం లేని రోగులను హాస్పిటల్ లోనే ఇన్ పేషంట్లుగా చేర్చుకుంటుండడంతో రోగులతో నిండిపోతోంది. మిగిలిన వారిని గాంధీ ఆస్పత్రికి పంపుతున్నారు. అయితే ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు సరైన వైద్యం అందడం లేదనే విమర్శలు వినబడుతున్నాయి . ప్రస్థుతం ఆస్పత్రిలోని పడకలు ఆక్సిజన్ బెడ్స్‌ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో కొత్తగా వచ్చే వారిని ప్రత్యామ్నాయం చూసుకోవాలని వైద్యులు, సిబ్బంది సూచిస్తున్నారు. ప్రస్థుతం ఆస్పత్రిలో 83 మంది రోగులకు ఆక్సీజన్ అందిస్తుండగా మరో 15మంది ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందడానికి ఉన్నత స్థాయిలో పైరవీ చేయాల్సి వస్తోందని కరోనా రోగులు వాపోతుండగా కొత్తగా చేరే వారికి ఆక్సీజన్ అందుబాటులో లేదు. దీంతో ప్రత్యామ్నాయం వెతుక్కుంటూ రోగులు తిరిగి వెళ్లిపోతున్నారు .
చివరి నిమిషంలో వచ్చే రోగులను….

కోవిడ్ బారిన పడి చివరి నిమిషంలో ఆస్పత్రికి వచ్చే రోగులను ఆస్పత్రిలో చేర్చుకోకుండా గాంధీ, టిమ్స్ లకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర మానసిక ఆందోళనలకు గురౌతున్నారు. ప్రైవేట్ కు వెళ్లే ఆర్ధిక స్థోమత లేక, ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యం అందక చనిపోతున్నారు. అయితే ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీగా ఉన్నా రోగులను ఖాళీ లేవని తిప్పు పంపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి . కరోనా ఉద్ధృతి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరిన్ని బెడ్ లను సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

నో వాక్సిన్ ….

నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజు వందల మంది వస్తున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్ కోసం వచ్చినవారు నిరాశతో వెరుతిరుగుతున్నారు . అయితే కరోనా టెస్టులు మాత్రం యధావిధిగా నిర్వహిస్తున్నారు . ఆస్పత్రికి వ్యాక్సిన్ సరఫరా కాకపోవడంతో బుధవారం వచ్చిన వారికి వ్యాక్సిన్ వేయలేదని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ప్రస్థుతం ఉన్న 100 పడకల స్థాయిని కూడా పెంచాలని కోరినట్లు వారు వివరించారు .

Advertisement

Next Story