యాదాద్రిలో వివాదాస్పదంగా మారిన MLA చిరుమర్తి పంచాయతీ

by Anukaran |   ( Updated:2021-12-09 09:53:25.0  )
యాదాద్రిలో వివాదాస్పదంగా మారిన MLA చిరుమర్తి పంచాయతీ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య యాదాద్రిలో కొత్త పంచాయతీ పెట్టిండా అంటే అవుననే సమాధానం వస్తుంది. యాదాద్రి ఆలయంలో నిబంధనలకు విరుద్దంగా యాదాద్రి అధికారులు ప్రవర్తించడం..100 మందితో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య యాదాద్రి ప్రధానాలయంలో కలియ తిరగడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ప్రజానీకానికి వంద షరతులు పెట్టే ఆలయ అధికారులు.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు మాత్రం రాచమర్యాదలతో ఓపెన్ కాని ప్రధానాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ క్యాంప్ రాజకీయాలు యాదాద్రి నరసింహుడి క్షేత్రానికి చేరుకున్నాయి.

హైదరాబాద్ దగ్గరలోని ఓ రిసార్ట్స్​లో క్యాంప్‌లో ఉన్న నకిరేకల్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి గురువారం వచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఛైర్మన్లు, ఎంపీపీ తో పాటు వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానాలయంలోకి వెళ్లారు. దాదాపు 100 మందికి పైగా వచ్చి నేరుగా ప్రధానాలయంలోకి వెళ్లారు. అంతకుముందు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆయన వెంట వచ్చిన వారి కోసం చాలా సేపు దర్శనాలను నిలిపివేయటం పై సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారికి రూల్స్ వర్తించవా..?

కొండపైన స్వామివారి ప్రధాన ఆలయంలోకి వైటీడీఏ, వీవీఐపీలకు తప్ప మరెవ్వరికీ అనుమతి లేదు. కానీ చిరుమర్తి తో వచ్చిన 100 మంది ప్రధానాలయంలోకి వెళ్లారు. సామాన్య భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వర్తించే రూల్స్ వారికి వర్తించవా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అంతమందితో వచ్చిన చిరుమర్తిని ప్రధాన ఆలయంలోకి ఎలా అనుమతిస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఓ రూల్.. వారికి మరో రూలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఆలయ అధికారులు నిరాకరించారు.

Advertisement

Next Story

Most Viewed