నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్ పార్టీ తోక కత్తిరించాలి

by Shyam |   ( Updated:2021-09-11 08:29:26.0  )
Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాయీ బ్రాహ్మణులకు జుట్టు కత్తిరించడమే కాకుండా అవసరమైతే ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ తోకలు ఎలా కత్తిరించాలో కూడా తెలుసునని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నెరవేర్చని హామీలకు వ్యతిరేకంగా శనివారం గాంధీ భవన్‌లో వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దాసోజు శ్రావణ్ పాల్గొని గాంధీ విగ్రహం వద్ద క్షవరం, గెడ్డం కత్తిరించి వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ..

మాటలతో మభ్య పెడతూ ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్నారు. నాయీ బ్రాహ్మణులు రాజకీయ చైతన్యం కలవారని, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజకీయాలను లోతుగా విశ్లేషించి ప్రజల్లో చైతన్యం నింపాలన్నారు. ఎన్నికల సమయంలో నాయీ బ్రాహ్మణుల కోసం అనేక వాగ్దానాలు చేసి, తీరా గెలిచాక నిలువునా మోసం చేశాడన్నారు. నాయీ బ్రాహ్మణులు నాగరికతకు చిహ్నమైన బిడ్డలని, వారిని మోసం చేయడానికి కేసీఆర్‌కు మనసు ఎలా వచ్చిందో తెలియడం లేదన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన 30వేల మోడ్రన్ సెలూన్లు, 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఎమ్మెల్సీ పదవి, బడ్జెట్‌లో రూ.250 కోట్లు వంటి హామీలు ఏమైనాయో అర్ధం కావడం లేదన్నారు. నాగరికత నేర్పిన నాయీ బ్రహ్మణులు ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం దయనీయ స్థితిలో ఎదురుచూసే పరిస్థితికి రావడం కలచివేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, శ్రీకాంత్ గౌడ్, నాయీ బ్రహ్మణ రాష్ట్ర స్థాయి నాయకుడు కొలిపాక సతీష్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed