అనుమతులు లేకుండా.. నో.. సభలు,సమావేశాలు : డిఐజి రంగనాధ్

by Shyam |
అనుమతులు లేకుండా.. నో.. సభలు,సమావేశాలు : డిఐజి రంగనాధ్
X

దిశ నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు అనుమతులు తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి ఏ.వి. రంగనాధ్ హెచ్చరించారు. బుధవారం నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2,500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వచ్చే అన్ని రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 37.73 లక్షల రూపాయల అక్రమ డబ్బు పట్టుబడినట్లు వెల్లడించారు. అదే విధంగా అక్రమంగా తరలిస్తున్న మూడున్నర లక్షల రూపాయల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు పెట్టవద్దని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉప ఎన్నికల కోసం ఉత్తరాఖండ్ కు చెందిన సీనియర్ అధికారిని పోలీస్ శాఖ తరఫున పరిశీలకునిగా కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిందని తెలిపారు. మద్యం, డబ్బు అక్రమంగా రవాణా చేస్తూ ఎవరు పట్టుబడినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఉప ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలంతా ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్చందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుని రాజ్యాంగ స్పూర్తిని చాటాలని కోరారు.

ప్రచార పర్వంలో మాస్క్ మస్ట్..

సాగర్ ఉప ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో బహిరంగ సభలకు వచ్చే ప్రజలు, నాయకులు విధిగా మాస్కులు ధరించడంతో పాటు కరోనా నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్కులు ధరించకపోతే జరిమానాలతో పాటు కేసులు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed