1000 కేంద్రాల్లో వరి కొనుగోళ్లు.. సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు

by srinivas |
1000 కేంద్రాల్లో వరి కొనుగోళ్లు.. సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల కోసం అధికారులు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు జరగొచ్చని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మొత్తం 1000 దాకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రాల ప్రారంభోత్సవాలు ఆయా నియోజకవర్గాల్లో జరిగాయి. కాగా మిగతా వాటిని ఈ వారం రోజుల్లో పూర్తి చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సిబ్బందికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

జిల్లాల వారీగా వివరాలు :

మహబూబ్ నగర్ జిల్లాలో ఏడాది రక్షా 47 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మొత్తం 183 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అయ్యారు. వనపర్తి జిల్లాలో మూడు లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కోసం 414 కేంద్రాలు , నాగర్ కర్నూల్ జిల్లాలో 1,50,000 నుండి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో 230 కేంద్రాలు, నారాయణపేట జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం 102 కేంద్రాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 1,75 మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అంచనాలతో అధికారులు వరి ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం అవుతుండగా.. ఇందులో పరిస్థితులను బట్టి మరికొన్ని కేంద్రాలు పెంచడం.. తగ్గించడం చేసే అవకాశాలు ఉన్నాయి.

కొనుగోళ్లను బట్టి గన్ని బ్యాగులు :

ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ళను బట్టి దశలవారీగా గన్ని బ్యాగులను సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే కొన్ని గన్ని బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాకు 36 లక్షలు, వనపర్తి జిల్లాకు 65 లక్షలు, నగర్ కర్నూల్ జిల్లాకు 36 లక్షలు, నారాయణపేట జిల్లాకు 37.5 లక్షలు, జోగులాంబ గద్వాల జిల్లాకు 42 లక్షల అన్ని బ్యాగులు అవసరం అవుతాయని ప్రభుత్వానికి అంచనాలు పంపారు. ఈ అంచనాల మేరకు వరి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితులను బట్టి గని బ్యాగులను ఎప్పటికప్పుడు సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్టు సమాచారం.

ఈనెల 20 తర్వాతనే కొనుగోళ్లు :

వరి కొనుగోలు కేంద్రాలు ఈ వారం రోజులలో పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. కేంద్రాలలో రైతులకు అవసరమైన కనీస సౌకర్యాలతో పాటు , అవసరమైన ఇతర సదుపాయాలను కూడా కల్పించనున్నారు. ఈనెల 20 తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

సన్న -దొడ్డు రకం కొనుగోళ్లు

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సన్న రకం , దొడ్డు రకం వడ్లను వేరువేరుగా కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లకు ముందు 17% లోపు తేమ ఉండి తూర్పు ఆరబట్టిన తరువాత ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. సన్న రకం వడ్ల బస్తాలపై ముద్రలు వేసి రెడ్ కలర్ దారాలతో కుట్లు వేస్తారు. ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు రిసిప్ట్ ఇస్తారు. చెల్లింపులకు సంబంధించి ఏ రోజుకు ఆరోజు వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. రూ 500 రూపాయల బోనస్ సన్నారకం వడ్ల వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు. మొత్తంపై వరి కొనుగోలు -చెల్లింపులు సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి.

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఈ వారం లోపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినప్పటికిని.. ఈనెల 20వ తేదీ తర్వాతనే వరి ధాన్యం కొనుగోళ్లు ఉంటాయి.

-లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగులాంబ గద్వాల జిల్లా.



Next Story