అనర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే సహించేది లేదు..: ఎమ్మెల్యే పద్మావతి

by Aamani |
అనర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే సహించేది లేదు..: ఎమ్మెల్యే పద్మావతి
X

దిశ,నడిగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలనే సదుద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితాలో అర్హులైన వారు ఒకరిద్దరు మిగిలిన మలి విడతలో మంజూరు చేయాలని, అనర్హులైన ఏ ఒక్కరిని ఇళ్ల జాబితాలో చేర్చవద్దని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూడాలని ఆమె సూచించారు. మండలం లో ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేసిన కాగిత రామచంద్రాపురంలో చేపట్టిన ఇంటి నిర్మాణాలను ఆమె మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, చిట్టచివరి లబ్ధిదారులకు మేలు చేయడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆమె పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి నప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందన్నారు. పేద ప్రజలందరూ నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే ఎక్కడా అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరులో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, జిల్లాలోనే కోదాడ నియోజకవర్గం ప్రప్రథమంగా ఉందని తెలిపారు.

పథక అమలుకు మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేయడం జరిగిందని అందులో భాగంగానే కేఆర్సీపురం గ్రామంలో అర్హులైన వారందరికీ ఇళ్ల మంజూరు చేశామని చెప్పారు. రూ. 13.45 కోట్లతో 269 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 93 ఇళ్లు బేస్ మెట్ దశలో ఉండగా మరో 26 ఇళ్లు గ్రౌండింగ్ దశ పూర్తి చేసుకున్నాయని అధికారులు ఎమ్మెల్యే కు వివరించారు. నిర్మాణాలు చేపట్టిన ప్రతి ఒక్క లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం మంజూరు చేయాలని గ్రామానికి చెందిన కొందరు వినతిపత్రం అందించగా వినతులు అందించే కాలం చెల్లిందని అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే ఇంటి స్థలాలను అందించి మలి విడతలో ఇళ్లు మంజూరు చేస్తామని, ఇంటి స్థలాలు లేని వారెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, తనకు పూర్తి అవగాహన వుందని, అంత వరకు ఓపిక పట్టాలని సున్నితంగా చెప్పారు. అనంతరం పప్పుల నర్సయ్య ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన ఆమె నిర్మాణం పూర్తి అయ్యాక గృహ ప్రవేశానికి ఆహ్వానించాలని సరదాగా సంభాషించారు.

ఎస్సీ కాలనీలో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకట రెడ్డి, తహసీల్దార్ వాసిమళ్ల సరిత, ఎంపీడీవో సంజీవయ్య, కోదాడ నియోజకవర్గ గృహ నిర్మాణ శాఖ ఏఈ జేఎస్ ఎన్ మూర్తి, ఆర్ అండ్ బీ డీఈ పవన్ కుమార్, ఎస్సై జి అజయ్ కుమార్, మాజీ జడ్పీటీసీ బాణాల కవిత నాగరాజు, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గుండు శ్రీను, దున్న శ్రీనివాస్, రమేష్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రాజేష్, లింగారెడ్డి, అంతి రెడ్డి, వెంకట్ రెడ్డి, నీలిమ గాంధీ, గుర్వారెడ్డి, వెంకట్రామిరెడ్డి, మల్లిఖార్జున్, మల్లేష్, నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed