ఈ సారి లాక్‌డౌన్ అంటే చారిత్రక తప్పిదమే : నాగబాబు

by srinivas |
ఈ సారి లాక్‌డౌన్ అంటే చారిత్రక తప్పిదమే : నాగబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తీవ్రంగా స్పందించారు. మరోసారి లాక్‌డౌన్ అంటే చారిత్రక తప్పిదం చేసినట్టే అవుతుందని… మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లాక్‌డైరీస్ పేరిట అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ఆయన… ఇంతకీ ఏమన్నారంటే.. ‘అసలు లాక్ డౌన్ అనేది ఎందుకు విధిస్తారు? అన్ని రకాల శక్తులు, వనరులను సమీకరించుకోవడానికే కదా! ప్రజలందరూ 90 రోజుల పాటు తమ జీవితాలను వదిలేశారు. వలస కార్మికుల వెతలు చెప్పనలవి కాదు.

ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ ప్రకటించి, ప్రజల జీవితాలను స్తంభింపచేస్తే అది చారిత్రక తప్పిదం అవుతుంది. ఏ రాష్ట్రం అయినా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సరిదిద్దుకోలేని తప్పుగా మిగిలిపోతుంది. చాలా దేశాలు లాక్‌డౌన్ లేకుండానే కరోనాను ఎదుర్కొంటున్నాయి. మనది పెద్ద దేశం కావడంతో ఇప్పటివరకు లాక్ డౌన్ నిర్ణయం సమంజసమే కావొచ్చు కానీ, మళ్లీ లాక్ డౌన్ అంటే ఆ నిర్ణయం సరికాదు. కరోనా నివారణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు స్పష్టంగా చెప్పండి. వాళ్లతో పాటించేలా చేయండి. ఇంకెన్నాళ్లు పని లేకుండా ఉండాలి? కరోనాతో చస్తే చచ్చాం… మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి అనేంతగా తిరుగుబాటు భావాలు ప్రజల్లోకి కలగడం సరికాదు” అని వ్యాఖ్యానించారు.

ఇన్నాళ్ల లాక్‌డౌన్ అనంతరం ప్రభుత్వాలు తగిన వనరులు సమీకరించుకుని ఉండాలి, కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికీ చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. 90 రోజుల లాక్‌ డౌన్‌తో దేశ ప్రజలు ఇళ్లలో ఉండడం ద్వారా తమ బాధ్యత నిర్వర్తించారని చెప్పిన నాగబాబు, లాక్‌డౌన్‌తో తమ జీవితాలను వదిలేసుకున్నారని గుర్తు చేశారు. ప్రజల బాధ్యత తీరిందన్న ఆయన ఇప్పుడు ప్రభుత్వాలు తమ బాధ్యత నెరవేర్చాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాలకు సూచించారు.

Advertisement

Next Story