అధికార పార్టీలో పోరు.. జెడ్పీ చైర్ పర్సన్ వర్సెస్ ఎమ్మెల్యేలు

by  |   ( Updated:2021-08-08 11:35:20.0  )
trs-flag 1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నడిగడ్డ అధికార పార్టీ నేతల మధ్య రాజకీయ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు పతాక స్థాయికి చేరుకోవడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల సస్పెండ్ అయిన సీఐతో 2 నెలల క్రితం జెడ్పీ చైర్ పర్సన్ భర్త తిరుపతయ్య మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో సంచలనంగా మారింది.

అసలు ఏం జరుగుతోంది?

జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ లుకలుకలు ఈరోజువి ఇవి కావు. గత రెండున్నర సంవత్సరాల నుండి కొనసాగుతున్నవే. ఈ జిల్లాలో అక్రమ ఇసుక, బియ్యం, మద్యం దందాలు జోరుగా సాగడం ఆ దందాలలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు సూత్రధారులు గా ఉండడం, పోలీసులు సైతం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రెండు వర్గాలుగా విడిపోయి వారివారి వర్గాలకు సహకారాలను అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కారణంగా ఇతర ఆదాయ వనరులు ఉన్న శాఖల అధికారులు సైతం రెండు వర్గాల వారికి న్యాయం చేయలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. పోలీస్ కేసులకు సంబంధించి అధికార పార్టీ నేతలు ఒక నేత అండగా నిలిస్తే.. మరోనేత అందుకు విరుద్ధంగా కేసులను ప్రోత్సహిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

మొదటి నుండి అదే పరిస్థితులు

జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీసీ మహిళలకు రిజర్వు చేసిన నేపథ్యంలో అధిష్టానం సరితా తిరుపతయ్య పేరు ఖరారు చేసింది. అలంపూర్ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వగా, గద్వాల ఎమ్మెల్యే అప్పట్లో వ్యతిరేకించారు. క్రమక్రమంగా జిల్లా పరిషత్ చైర్మన్ కు గద్వాల ఎమ్మెల్యే తోనే కాకుండా అలంపూర్ ఎమ్మెల్యే తోను విభేదాలు మొదలయ్యాయి. ఆ విభేదాలు తారా స్థాయికి చేరుకొని ఇప్పుడు ఒకరిపై ఒకరు అది స్థానానికి ఫిర్యాదులు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

ఒక్కటైన ఎమ్మెల్యేలు

మొదట్లో ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేది. క్రమక్రమంగా ఇద్దరు ఎమ్మెల్యేలు చేతులు కలిపారు. ఒక నియోజకవర్గ వ్యవహారాలలో మరొకరు తలదూర్చి కూడదు అని ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

లీకు వీరుడు ఎవరు..?

జెడ్పీ చైర్ పర్సన్ భర్త తిరుపతయ్య, సస్పెన్షన్‌కు గురైన సీఐ జక్కుల హనుమంతు మధ్య జరిగిన ఆడియో లీక్ చేసిన వీరుడు ఎవరు అని జోగులాంబ గద్వాల జిల్లా తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అది ముమ్మాటికీ సస్పెన్షన్కు గురైన సిఐ పనే అని ప్రతి ఒక్కరు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ అవకాశాన్ని ప్రత్యర్థులు సద్వినియోగం చేసుకుని యత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించాయి లేదా అన్న విషయం త్వరలోనే తేలనుంది.

క్షమాపణ చెప్పిన తిరుపతయ్య

ఆడియో లో కొన్ని మాటలను మాత్రమే లీక్ చేశారు. మొత్తం ఆడియో రిలీజ్ చేసి ఉంటే నేను ఏం మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది అర్థమయ్యేది. కానీ ఒక వర్గాన్ని కించపరిచినట్లు లక్షణాలు వచ్చాయి. అందుకు ఆ వర్గ సోదరులను క్షమించమని వేడుకుంటున్నాను అని ఓ ప్రకటనను విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed