దేశానిది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ

by Anukaran |   ( Updated:2020-08-27 10:08:59.0  )
దేశానిది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశానిది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం ప్రగతి భవన్‌లో నాబార్డు ఛైర్మన్ జీఆర్ చింతల సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశ ఆర్థికవ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంలో మార్పు రావాలని, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి చేరాలన్నారు.

వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేయడంతో పాటు, పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలన్నారు. దేశంలో 15కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా మరిన్ని కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయ దారులేనని, ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత జనభా కలిగిన దేశానికి ప్రపంచంలో ఏదేశం కూడా తిండి పెట్టలేదని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలని, ఆహార అవసరాలను గుర్తించి ఎగుమతి చేసే విధానం రావడంతో పాటు నాబార్డు అధ్యయనం చేయాలని అన్నారు.

తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి అవసరమైన ఆర్థిక చేయూత అందించే పథకాలు, కార్యక్రమాలకు నాబార్డు రూపకల్పన చేయలన్నారు. మరో ముఖ్యమైన సమస్య కూలీల కొరత అని, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలన్నారు. నాటు, కలుపు తీసే యంత్రాలు, వరికోత యంత్రాలు ఎక్కువ సంఖ్యలో రావాలని, దీనికి అవసరమైన ఆర్థిక సాయం, సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed