నా బిడ్డలు దొంగలు కాదు: వైఎస్ విజయమ్మ భావోద్వేగ వ్యాఖ్యలు

by Anukaran |
ys vijayamma latest
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల పార్టీ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన వైఎస్ విజయమ్మ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. నా బిడ్డను ఖమ్మంలోనే ప్రజలకు అప్పగించానని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విమర్శలు చేశారన్నారు. షర్మిల పార్టీ పెడితే అధికార పార్టీ నేతలు, ఇతర పార్టీల నాయకులు ఎందుకు తమ వైఖరిని, తమ వ్యూహాలను మార్చుకున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేడు వైఎస్సార్ ను తమ సొత్తు అని భావిస్తున్నారని, ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలని, ఆయనపై ఎఫ్ఐఆర్ పెట్టిన కాంగ్రెస్ నేడు ఆయన జపం చేస్తోందని విమర్శలు చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించే వాడే అసలైన నాయకుడని, ఉద్యోగ, రైతులకు అండగా నిలవడం అన్నీ చేసిన నేత వైఎస్సార్ అని గుర్తు చేశారు.

ఆయన తెలుగు ప్రజల గుండె చప్పుడని, ఆయన ఈ గడ్డను ఎంతగా ప్రేమించారో.. ప్రజలు కూడా ఆయన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యాక ఈ ప్రాంతానికి సంక్షేమంలో, అభివృద్ధిలో, జలయజ్ఞం వంటి పథకాలతో పెద్ద పీట వేశారన్నారు. ఆయన హఠాన్మరణంతో ఎంతో మంది తెలంగాణ ప్రజలు చనిపోయారని, తెలంగాణ సశ్యశ్యామలం కావాలనేది ఆయన సంకల్పమని, వైఎస్సార్ మరణంతో ఆయన కల అసంపూర్ణంగా మిగిలిపోయిందన్నారు. ఆయన రక్తాన్ని పుణికి పుచ్చుకున్నది జగన్, షర్మిల లని, వారు నేడు వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా పనిచేస్తున్నారన్నారు.

ప్రజల మంచి కోసమే షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిందని, షర్మిల మెట్టినిల్లు తెలంగాణ అని, ఆమె రాజకీయాల్లోకి వచ్చేది తన తండ్రి కలలను నెరవేర్చడం కోసమేనని, జగనన్న బాణంగా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిందన్నారు. 3000 కిలోమీటర్ల దూరం ఒక ఆడపిల్లను ఎలా పంపగలనని, కానీ షర్మిల ఎక్కడా వెనుకడుగు వేయలేదని, ఎండ, వాన, చలి ఆమె పాదయాత్ర ఆపలేకపోయాయని భావోద్వేగమయ్యారు. ఆమెలో ఉన్న సంకల్పం, చిత్తశుద్ధి.. ఆమెను నడిపించిందని, ఈ రోజు పార్టీ పెట్టి మీ ముందుకు వస్తోంది, ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో చూడండని, గతంలో పొలాల్లో రక్తం పారితే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక నీరు పారి పల్లెలు అభివృద్ధి అయ్యాయన్నారు.

తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్తు కోసం షర్మిల మీ ముందుకు వస్తోందని, అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశము బలంగా ఉంటుందని, రెండు తెలుగు రాష్ట్రాలు మనవే.. రాష్టల మధ్య వనరుల విషయంలో వివాదాలు రావొచ్చు కానీ పరిష్కార మార్గాలున్నాయన్నారు. వైఎస్సార్ కానీ, ఆయన బిడ్డలు కానీ, దొంగలు, గజదొంగలు కాదన్నారు. మా కుటుంబానికి దాచుకోవడం, దోచుకోవడం తెలియదు. అభివృద్ధి పంచడం మాత్రమే తెలుసునన్నారు. వైఎస్సార్ చివరి వరకు ప్రజల కోసమే బతికాడని, అందరూ షర్మిలకు అండగా ఉండాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed