మతసామరస్యానికి ప్రతీక.. హిందూ టెంపుల్ నిర్మించిన ముస్లిం

by Shyam |
temple
X

దిశ, ఫీచర్స్: భారతదేశం భిన్న మతాలకు పుట్టినిల్లే కాదు.. విభిన్న సంస్కృతీ సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వం భారత వారసత్వంగా కొనసాగుతుండగా.. పరమత సహనం, మత సామరస్యం పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే భిన్న మతాలు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే అన్న భావన ముఖ్యం. ఎందుకంటే ఇటీవల కాలంలో పరమతాలపై అసహనం వ్యక్తపరుస్తూ, హింస చెలరేగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఓ ముస్లిం వ్యక్తి హిందూ దేవాలయాన్ని నిర్మించి మతసామరస్యానికి నిజమైన ప్రతీకగా నిలిచాడు.

కేరళకు చెందిన పి. ఖాసిం సాహిబ్ భార్యాపిల్లలతో కలిసి 35 ఏళ్ల కిందట కర్నాటకకు వలసొచ్చాడు. ఈ మేరకు భార్యాపిల్లలతో కలిసి మంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కి తాలుకాలోని కవథారులో సెటిల్ అయ్యాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్‌లో ఆయన కాలుకు గాయమైంది. ఆ సమయంలో అతడి భార్య, ఐదుగురు పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంటి యజమాని అయిన సాహిబ్ పని చేయకపోవడంతో వాళ్లకు ఇల్లు గడవడం కూడా కష్టమైంది. ఆ సమయంలో సాహిబ్ ఊరి పూజారిని సంప్రదించగా.. తీర ప్రాంత జిల్లాలకు ఆరాధ్య దేవుడైన కొరగజ్జ టెంపుల్ నిర్మిస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పాడట. ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించిన సాహిబ్.. కాలి గాయం నయమయ్యాక కవథారులో సాహిబ్ కొరగజ్జ దేవాలయాన్ని నిర్మించాడు. ఇక అప్పటి నుంచి శాకాహారిగా మారిన సాహిబ్ ప్రతీ రోజు పూజలు చేస్తున్నాడు.

తను ముస్లిం అయినప్పటికీ ఎప్పుడైతే గుడిని నిర్మించానో ఆనాటి నుంచి హిందూ దేవుళ్లపైన నమ్మకాన్ని ఏర్పరుచుకున్నానని, అయితే తన భార్యా పిల్లలను తాను హిందూ దేవుళ్లనే పూజించాలని బలవంతం చేయలేదని చెప్తున్నాడు సాహిబ్. వారు మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేస్తారని.. తాను మాత్రం కొరగజ్జ, ఇతర హిందూ దేవతలకు పూజలు చేస్తానని తెలిపాడు. ఇక తను నిర్మించిన పుణ్యక్షేత్రానికి హిందువులే కాకుండా ఇతర మతాలకు చెందిన వారు కూడా వస్తారని వెల్లడించాడు.

Advertisement

Next Story