మెప్పులేనా..వేతనాలిచ్చేది లేదా..?

by Shyam |
మెప్పులేనా..వేతనాలిచ్చేది లేదా..?
X

దిశ, మహబూబ్‌నగర్: భారత్ సహా ప్రపంచాన్ని నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వణికిస్తోన్నది. ఈ తరుణంలో కూడా తమ విధులను అంకితభావంతో నిర్వర్తిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేస్తోన్న సైనికులు పారిశుధ్య కార్మికులు. అటు వైద్యులు, ఇటు పోలీసులతో పాటుగా వారూ తమ విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నారు. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రితో పాటు అధికారులు అందరూ వారి సేవలను గుర్తించి మెచ్చుకుంటున్నారు. అయితే, మెప్పులు మాత్రమే వారి కడుపులు నిండవనే విషయం మాత్రం వారు గ్రహించాలనీ, పారిశుధ్య కార్మికులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏప్రిల్ మూడో వారం గడుస్తున్న నేటికీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందలేదనీ, అనేక సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తాము
విధులకు హాజరవుతున్నా ప్రభుత్వం వేతనాలు అందించకపోవడం సరికాదని జిల్లాకు చెందిన పలువురు కార్మికులు అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 19 పురపాలికల్లో 1,647 మంది పారిశుధ్య కార్మికులు ఉండగా వారిలో 294 మంది రెగ్యులర్ కార్మికులు 1, 353 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా తమ విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇందులో కొన్ని పురపాలికల్లో వేతనాలు ఇప్పటికే అందగా మరి కొన్ని పురపాలికల్లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలే అందలేదు. అదే సమయంలో కొంత మందికి ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.5 వేల నజరానా అందగా మరికొంత మందికి కనీసం వేతనాలు అందలేదు. దీంతో అందని వారు బాధపడుతున్నారు. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తాము విధులు నిర్వర్తిస్తుంటే తమకు వేతనాలు ఇప్పటి వరకు అందించకపోవడం సబబేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం తమవంతు బాధ్యతగా వ్యవహరిస్తూ విధులకు హాజరవుతుంటే తమ కుటుంబీకులు అకలికి అలమటించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వారిగా కార్మికులు సంఖ్యను పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో 459, వనపర్తిలో 143, నాగర్ కర్నూల్ 170, కొల్లాపూర్ 48, అచ్చంపేట 70, కల్వకుర్తి 72, గద్వాల 137, అయిజ 26, కోస్గి 69, జడ్చర్ల 85, మక్తల్ 56, నారాయణపేట 106, కొత్తకోట 35, అమరచింత 15, ఆత్మకూరు 25, పెబ్బేరు 62, అలంపూర్ 24, భూత్పూరు 45 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వీరిలో 1,353 మంది ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. అసలే చాలీచాలని వేతనాలు అందే తమకు నెలల తరబడి వేతనాలు నిలపడం వల్ల అనేక అవస్థలు పడుతున్నామని అంటున్నారు. కావున అధికారులు స్పందించి వెంటనే తమకు వేతనాలు అందేలా చూడాలని కోరుతున్నారు.

Tags: Municipal staff, duty, on corona times, lockdown, praising only, no salary

Advertisement

Next Story

Most Viewed