ఇకపై ఫంక్షన్ హాల్‌లలో వాటికి అనుమతి లేదు

by Shyam |   ( Updated:2021-08-25 07:02:36.0  )
Municipal Commissioner Ramanachari
X

దిశ, సిద్దిపేట: ఇకపై ఫంక్షన్‌ హాల్‌లలో ప్లాస్టిక్‌ను వాడొద్దని యజమానులకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి సూచించారు. బుధవారం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఫంక్షన్ హాల్ యాజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంత్రి హరీష్ రావు చొరవతో పట్టణంలో 34 స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశామని అన్నారు. శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకునే వారికి ముందస్తుగానే ప్లాస్టిక్ వాడటం లేదని సమాచారం అందజేయాలని సూచించారు. ఫంక్షన్ హాల్ బయట ‘ప్లాస్టిక్ వాడకం నిషేధం’ అని బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాణానికి హానికరమైన ప్లాస్టిక్‌ను వదిలేసి, స్టీల్ బ్యాంకులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఫంక్షన్‌ హాల్‌లో ఉపయోగించే ప్రతీ వస్తువు స్టీల్ బ్యాంకులో అందుబాటులో ఉందని, కావాల్సిన వారు సిద్దిపేట స్టీల్ బ్యాంక్ యాప్ ద్వారా పొందవచ్చన్నారు. ఇకనుంచి ప్రతీ ఫంక్షన్ హాల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ప్లాస్టిక్ వాడకం కనిపిస్తే ఐదువేల నుంచి రూ. 25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కాగా, దీనికి స్పందించిన ఫంక్షన్ హాల్ యజమానులు ప్లాస్టిక్ నిషేధానికి సహకరిస్తామని తెలిపారు. ఫంక్షన్ హాల్‌లలో తడి చెత్త, పొడి చెత్తను పారేయడానికి మున్సిపల్ వాహనాన్ని ఉపయోగించాలని అన్నారు. అంతేగాకుండా.. ప్రతీ ఫంక్షన్ హాల్ యజమాని మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed