‘పెద్దపల్లిలో ఎంఎస్ గ్యాంగ్ ల్యాండ్ మాఫియా’

by Sridhar Babu |
‘పెద్దపల్లిలో ఎంఎస్ గ్యాంగ్ ల్యాండ్ మాఫియా’
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో కొత్తగా ఎంఎస్ గ్రూప్ పేరిట భూదందా సాగుతోందని డీసీసీ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. గత ఏప్రిల్ నెలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్‎లు జరిగిన రెండో స్థానంలో పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిలిచిందన్నారు. జిల్లాలో బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమికి రూ . 2 నుంచి 3 మూడు కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేశారన్నారు. ఈ లావాదేవీల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారినప్పటికీ నామామాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని సతీష్ ఆరోపించారు.

వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి, నాలా కన్వర్షన్, అప్రూవుడ్ లే ఔట్ లేకుండా అమ్మకాలు చేస్తూ అమాయకులను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం గుంటకు వేల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేపిస్తూ, అమ్మకాలు మాత్రం లక్షల రూపాయల్లో చేస్తూ కోట్లు దోచుకుంటున్న దళారులు అండగా రాజకీయ నాయకులు ఉంటున్నారన్నారు. ఏడేళ్లుగా రాజకీయ నాయకుల అండతో మంథని ప్రాంతానికి చెందిన ఎంఎస్ గ్యాంగ్‌గా చెప్పుకొనే ఓ గ్రూప్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కాటారం, మంథని ప్రాంతాల్లో ఈ దందా సాగుతోందని తెలిపారు. ఈ గ్రూప్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఇదే తరహాలో రియల్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

ఎకరం.. 3 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ విలువ చూపిస్తున్న రెండు ఎకరాల పై చిలుకు భూమిని ఏకంగా రూ. 4 కోట్ల 80 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి, రూ. 80 లక్షలు అడ్వాన్స్‌గా ముగ్గురు రైతులతో అగ్రిమెంట్ చేస్తున్నారని సతీష్ వివరించారు. పెద్దపల్లి నూతన కలెక్టరేట్ ఎదురుగా పెద్ద కల్వల రెవెన్యూ శివారులో నూతన వెంచర్‌ల పేరిట వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేస్తున్నారని, పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి గీత పరిశీలించి విచారణకు కూడా ఆదేశించారన్నారు. మంథని బహిరంగ మార్కెట్‌లో గుంటకు రూ. 5 లక్షల నుండి 15 లక్షల వరకు అమ్ముకొని పెద్ద ఎత్తున సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. ఈ భూదందాలపై ఆయా ప్రభుత్వ శాఖలు సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇనుముల సతీష్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story