ఓడిపోయే స్థానాలకు హరీశ్‌రావు ఇన్‌చార్జ్.. కుట్ర జరుగుతోంది..!

by Anukaran |   ( Updated:2021-02-27 08:39:17.0  )
ఓడిపోయే స్థానాలకు హరీశ్‌రావు ఇన్‌చార్జ్.. కుట్ర జరుగుతోంది..!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి/ చేవెళ్ళ: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కూడా ఇచ్చేందుకు చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. కేవలం తన ఇంట్లో ఉండే ఐదుగురు నిరుద్యోగులకే పదవులు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చల్లా నరసింహా రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఓడిపోయే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి హరీశ్‌రావును కావాలనే ఇన్‌చార్జ్ నియమించారన్నారు. దుబ్బాకలో ఒకసారి ఓటమిని చవిచూసిన ఆయనను.. మరొకసారి ఓడిపోతామని తెలిసే ఇన్‌చార్జీగా నియమించారని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు సీఎం పట్టం కట్టేందుకే హరీశ్‌రావును ఓడిపోయే సీట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్‌ ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీజైన్ పేరుతో రద్దు చేశారని.. చుక్క నీరు లేకుండా కుట్ర చేశారన్నారు. ఆ నీటిని సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాలకు తరలించుకుపోయారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed