ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి : కోమటిరెడ్డి

by Shyam |   ( Updated:2020-02-14 08:36:55.0  )
ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి : కోమటిరెడ్డి
X

కేసీఆర్‌కు కాళేశ్వరం తప్ప వేరే ప్రాజెక్టులు కనబడటం లేదా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్,2బీసీ ప్రాజెక్టులపై కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరో చెప్పాలని, ఈ ప్రాజెక్టుల మీద కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్‌లను 90 శాతం పూర్తి చేశామన్నారు. బ్రాహ్మణ వెల్లంలకు రూ.100 కోట్లు, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టుకు రూ.700 కోట్లు నిధులు విడుదల చేస్తే పనులు పూర్తి అవుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద కేసీఆర్ ఎంతో దోచుకుతిని, కాళేశ్వరాన్ని కమీషన్ల ప్రాజెక్ట్‌గా మార్చారన్నారు. శ్రీశైలం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ల సాధనకు గతంలో పాదయాత్ర‌కు డీజీపీ అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు.

త్వరలోనే ప్రోజెక్టుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఎమ్మెల్యేలను ప్రాజెక్ట్‌ల పైన ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో తిరగనియ్యకుండా హక్కుగా రావాల్సిన నీళ్ల కోసం పోరాటం చేద్దామన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను రాళ్లతో కొట్టండి, అప్పుడే అసలు రైతుల ఉద్యమం మొదలు అవుతుందన్నారు. ‘‘కుర్చీ వేసుకొని ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తా అన్నావు కేసీఆర్.. కుర్చీ దొరకడం లేదా’’ అని ఎద్దెవా చేశారు. ‘‘నువ్వు మనిషివైతే ఆ ప్రాజెక్ట్‌లను పూర్తి చెయ్’’…అని సవాల్ విసిరారు.

Advertisement

Next Story