ఆ కుటుంబాన్ని చూస్తే కన్నీరు ఆగడం లేదు.. కోమటిరెడ్డి ఎమోషనల్

by Shyam |   ( Updated:2021-07-17 08:48:04.0  )
Congress MP Komatireddy Venkat Reddy
X

దిశ, భువనగిరి రూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం కొప్పోలు గ్రామంలో హత్యకు గురైన దళిత మైనర్ బాలిక కుటుంబసభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ద‌ళిత మైన‌ర్ హ‌త్య ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. మైనర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కుటుంబ బాధ‌ల‌ను చూస్తుంటే కన్నీరు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం కొడుకును కోల్పోయి, ఇప్పుడు కూతురును కోల్పోయి, తండ్రి అనారోగ్యంతో మంచానపడటం చూస్తుంటే కన్నీరు వస్తోందని అన్నారు.

ఈ ఘటన జ‌రిగి, దాదాపు 5 రోజులైనా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎస్ఐ‌కి ఫిర్యాదు చేస్తే.. ఆత్మహత్యగా చిత్రీకరించి, కేసు మూసేసే ప్రయత్నం చేయడం ఏంటని మండిపడ్డారు. ఘ‌ట‌నా స్థలిలో బీరు సీసాలు ఉండటం, మృతికి పవన్ అనే వ్యక్తి కారణం అని తెలిసినా.. కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసును మూసేసే ప్రయత్నం చేస్తున్నారని విమ‌ర్శించారు.

ప్రభుత్వ అధికారులు స్పందించి, వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. ఆ కుటుంబానికి అన్యాయం చేయాలనుకున్న సదరు ఎస్ఐని విధుల్లోంచి తొలగించాలని, నిందితులను వెంటనే శిక్షించాలని కోరారు. ఉండటానికి ఇళ్లులేని ఆ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా కోరారు. లేదంటే న్యాయం కోసం కేసీఆర్ ప్రగతిభ‌వ‌న్ ముందు ద‌ళిత సంఘాల‌తో క‌లిసి నిరాహార దీక్షకు సైతం వెన‌క‌డుగు వేయమ‌ని స్పష్టం చేశారు. బాధిత కుటుంబం త‌ర‌పున న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతాన‌ని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed